PM Modi: సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్... మోదీ స్పందనిదే
ABN , Publish Date - Feb 01 , 2024 | 03:28 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రగతి శీలక బడ్జెట్'గా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఒక గ్యారెంటీ ఇచ్చిందన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ (Union Budget)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. 'ప్రగతి శీలక బడ్జెట్' (Prograssive Budget)గా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఒక గ్యారెంటీ ఇచ్చిందన్నారు. సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్ ఇదని, దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పారు.
''యువభారత్ ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబించింది. బడ్జెట్‌లో రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి పరిశోధన, రెండవది స్మృతనాత్మకత. సాంకేతిక రంగంలో పరిశోధన, స్మృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేశాం. తద్వారా దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసాన్ని ఇచ్చాం. వికసిత్ భారత్ నాలుగు మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, కర్షకులకు సాధికారత అవసరాన్ని బడ్జెట్ బలంగా చెప్పిందని, యువతకు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రధాని తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేసే 'లక్ పతి దీదీస్' పథకాన్ని 3 కోట్ల మందికి విస్తరించనున్నాం. పేదలకు మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ప్రకటించాం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆశా, అంగన్‌వాడి వర్కర్లు సైతం లబ్ధి పొందుతారు'' అని మోదీ చెప్పారు.