Assembly Bypoll Results 2024: అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై రాహుల్, ఖర్గే తొలి రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Jul 13 , 2024 | 09:29 PM
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'ఇండియా' కూటమి 10 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఏడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ అల్లిన భయం, గందరగోళం బద్దలయ్యాయని అన్నారు.
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'ఇండియా' కూటమి 10 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఏడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ అల్లిన భయం, గందరగోళం బద్దలయ్యాయని అన్నారు. రైతులు, యువకులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ నియంతృత్వాన్ని పూర్తిగా అంతమొందించి న్యాయపాలనను కోరుకుంటున్నారని, ప్రజలు మెరుగైన జీవితాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమికి బాసటగా నిలబడుతున్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ పేర్కొన్నారు.
Assembly Bypoll Results 2024: 10 స్థానాల్లో 'ఇండియా' కూటమి ఘనవిజయం, 2 సీట్లకే పరిమితమైన బీజేపీ
మోదీ, షా విశ్వసనీయత పడిపోయింది: ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల రాజకీయ విశ్వసనీయత పడిపోయిందనడానికి అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇండియా కూటమిగా మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ గెలుపు కొసం కఠోర పరిశ్రమ చేసిన కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. బీజేపీ దురహంకారం, తప్పులతడక పాలన, నెగిటివ్ రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారనడానికి ఇండియా కూటమి విజయమే బలమైన నిదర్శనమని చెప్పారు. కాగా, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేష వ్యాప్తి కారణంగానే ప్రజలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. గెలుపొందిన కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అభినందనలు తెలిపారు.
For Latest News and National News click here