Sandeshkhali probe: సీబీఐకి షాజహాన్ షేక్‌ను అప్పగించండి.. హైకోర్టు సంచలన ఆదేశం
ABN , Publish Date - Mar 05 , 2024 | 04:20 PM
ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన సందేశ్‌ఖాలి ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కోల్‌కత్తా హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దాడి కేసు నిందితుడుషేక్ షాజహాన్ ను మంగళవారం మధ్యాహ్నం 4.30 గంటల కల్లా సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కోల్‌కతా: ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన సందేశ్‌ఖాలి (Sandeshkhali) ఘటనపై దర్యాప్తును సీబీఐ (CBI)కి అప్పగించాలంటూ కోల్‌కత్తా హైకోర్టు (Calcutta High Court) సంచలన ఆదేశాలిచ్చింది. దాడి కేసు నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ (Sheikh Shahjahan)ను మంగళవారం మధ్యాహ్నం 4.30 గంటల కల్లా సీబీఐకి అప్పగించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. షాజహాన్‌ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు.
టీఎంసీ నేత షాజహాన్ అకృత్యాలపై స్థానికులు, బీజేపీ నిరసనలు చేపట్టడంతో ఫిబ్రవరి 29న బెంగాల్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. తొలుత ఈ దాడికి సంబంధించిన కేసు దర్యాప్తునకు సీబీఐకి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, రాష్ట్ర పోలీసులకు అప్పగించాలనంటూ సింగిల్ బెంచ్ ఆదేశించగా, దీనిని ఈడీ, పశ్చిమబెంగాల్ సర్కార్ సవాలు చేశాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి మాత్రమే అప్పగించాలని ఈడీ కోరగా, రాష్ట్ర పోలీసులకే అప్పగించాలని బెంగాల్ సర్కార్ కోరింది. ఈ క్రమంలో ఈడీ అధికారులపై దాడి, భూఆక్రమణలు, మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలపై షేక్ షాజహాన్‌ను సీబీఐ, ఈడీ, పశ్చిమబెంగాల్ పోలీసుల్లో ఎవరైనా అరెస్టు చేయవచ్చని హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ మరుసటి రోజే షాజహాన్‌ను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.