Central Government : పశ్చిమ కనుమల్లో మైనింగ్ బంద్!
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:13 AM
పశ్చిమ కనుమల్లోని 56,800 కి.మీ.ల ప్రాంతాన్ని ‘పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం’గా (ఈఎ్‌సఏ)గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం 5వ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
6 రాష్ట్రాల్లోని 56,800 కి.మీ.ల ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనది
మైనింగ్, క్వారీయింగ్ నిషేధం.. ఇప్పటికే ఉన్న వాటిని దశలవారీగా నిలిపివేయాలి
కొత్తగా భారీ నిర్మాణాలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులూ చేపట్టవద్దు
5వ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల.. సూచనలు, అభ్యంతరాలకు 60 రోజులు
న్యూఢిల్లీ, ఆగస్టు 2: పశ్చిమ కనుమల్లోని 56,800 కి.మీ.ల ప్రాంతాన్ని ‘పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం’గా (ఈఎ్‌సఏ)గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం 5వ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూలై 31న విడుదలైన ఈ నోటిఫికేషన్‌పై ఏమైనా సూచనలు, అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని పేర్కొంది. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి, వరద బీభత్సంలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం పశ్చిమ కనుమలు విస్తరించిన ఆరు రాష్ట్రాల్లోని భూభాగాన్ని ఈఎ్‌సఏగా ప్రకటించారు. దీని కింద కర్ణాటకలో 20,668 చదరపు కి.మీ.లు, మహారాష్ట్రలో 17,340 చదరపు కి.మీ.లు, కేరళలో వయనాడ్ జిల్లాలోని 13 గ్రామాలతోపాటు మొత్తం 9,933 చదరపు కి.మీ.లు, తమిళనాడులో 6,914 చదరపు కి.మీ.లు, గోవాలో 1,461 చదరపు కి.మీ.లు, గుజరాత్‌లో 449 కి.మీ.ల ప్రాంతం ఉంది.
ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం, ఈఎ్‌సఏగా పరిగణించే ప్రాంతంలో మైనింగ్, క్వారీయింగ్, ఇసుక తవ్వకాలపై పూర్తి నిషేధం ఉంటుంది. ఇప్పటికే మైనింగ్ జరుగుతుంటే లీజు గడువు పూర్తయిన తర్వాత లేదా తుది నోటిఫికేషన్ విడుదలైన ఐదేళ్లలోపు (ఏది ముందైతే అది) దానిని నిలిపివేయాలి. కొత్తగా బొగ్గు ఆధారిత (థర్మల్) విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవద్దు.
ఇప్పటికే ఉన్న వాటిని నడపవచ్చుగానీ, విస్తరించరాదు. భారీస్థాయి టౌన్‌షి్‌పలు, భవనాల నిర్మాణాలపై నిషేధం ఉంటుంది. కాగా, పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పశ్చిమ కనుమలపై ఏ విధంగా ఉందన్నది అధ్యయనం చేయటానికి 2010లో ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
పశ్చిమ కనుమల్లోని మొత్తం పర్వత ప్రాంతాన్ని ఈఎ్‌సఏగా ప్రకటించాలని ఈ కమిటీ 2011లో సిఫార్సు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానికుల నుంచి ఈ సిఫార్సులపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 2013లో కేంద్రప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కే కస్తూరిరంగన్ సారథ్యంలో మరో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ పశ్చిమ కనుమల్లో 37 శాతం భూభాగం (59,940 కి.మీ.లు) పర్యావరణపరంగా సున్నితమైనదని గుర్తించింది. ఇప్పటి వరకూ ఈ కమిటీ నాలుగు ముసాయిదా నోటిఫికేషన్లు విడుదల చేయగా, తాజాగా ఐదవది విడుదలైంది.