Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సీరియస్.. రిటర్నింగ్ అధికారి మళ్లీ హాజరుకావాలని ఆదేశం
ABN , Publish Date - Feb 19 , 2024 | 05:31 PM
చండీగఢ్ మేయర్ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారనే ఆరోపణలపై కఠినంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను రేపు కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేకాదు బ్యాలెట్ పత్రాలు కూడా సమర్పించాలని ఆదేశించింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేసే విషయంలో సుప్రీంకోర్టు(Supreme Court) కఠినంగా వ్యవహరించింది. ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీ(BJP)లో చేరిన మరుసటి రోజు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా మీరు కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారని కోర్టు రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించింది. అంతేకాదు దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
దీనిపై న్యాయస్థానానికి సరైన సమాధానం చెప్పాలని కోరింది. బ్యాలెట్ పేపర్‌పై ఎందుకు మార్కులు వేశారు, మీరు ఎన్ని పేపర్లు మార్క్ చేశారని అడిగింది. దీనిపై ఎన్నికల అధికారి(Election Officer) అనిల్ మసీహ్ మాట్లాడుతూ కెమెరా చూసి క్లారిటీ ఇచ్చారు. ప్రజలు కెమెరా-కెమెరా అంటూ అరుస్తున్నారని, అందుకే నేను అక్కడ చూశానని చెప్పాడు. అయితే ఈ సమాధానంతో కోర్టు సంతృప్తి చెందలేదు. ఆ సమయంలో ఎనిమిది తప్పుడు బ్యాలెట్ పేపర్లను వేరు చేసేందుకు వేరువేరుగా మార్కులు వేసినట్లు మసీహ్ తెలిపారు.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కస్టడీలో ఉన్న బ్యాలెట్ పేపర్‌ను ఎస్సీ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాలెట్ పత్రాల భద్రతను నిర్ధారించడానికి, వాటిని ఎస్సీ ముందు ఉంచడానికి ఒక అధికారిని నియమించాలని హెచ్‌సీ రిజిస్ట్రార్ జనరల్‌ను ఎస్సీ ఆదేశించింది. ప్రస్తుతం జరుగుతున్న ‘హార్స్ ట్రెడింగ్(hourse trading)’ ఆందోళన కలిగించే అంశమని కోర్టు పేర్కొంది. బ్యాలెట్ పేపర్ల(ballot papers)ను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు కూడా హాజరు కావాలని రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ రేపు జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు పూర్తి వీడియో రికార్డింగ్‌ను సుప్రీంకోర్టు సమీక్షించనుంది.