Kanwar Yatra row: నేమ్ ప్లేట్ ఆదేశాలపై యూపీ బాటలో ఛత్తీస్‌గఢ్..
ABN , Publish Date - Jul 20 , 2024 | 08:59 PM
కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దూమారం రేగుతున్న నేపథ్యంలో యూపీ బాటలో నడించేందుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ యువజన సంక్షేమ, రెవెన్యూ శాఖ మంత్రి టాంక్ రామ్ వర్మ ధ్రువీకరించారు.
రాయపూర్: కన్వర్ యాత్ర (Kanwar Yatra) సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దూమారం రేగుతున్న నేపథ్యంలో యూపీ బాటలో నడించేందుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ యువజన సంక్షేమం, రెవెన్యూ, ప్రకృతి వైపరీత్యాల శాఖ మంత్రి టాంక్ రామ్ వర్మ ధ్రువీకరించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుతం తీసుకున్న చర్యలనే రాష్ట్రంలోనూ అమలు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ధాంతరిలో జరిగిన బీజేపీ జిల్లా వర్కింగ్ కమిటీ సమవేశంలో ఆయన వెల్లడించారు.
Chirag Paswan: కులగణన మంచిదే... కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్య
తినుబండారాల దుకాణాలపై యజమానుల పేర్లను తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే విపక్షాల నుంచే కాక ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన కొందరు నేతల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. విభజన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని, దేశాభివృద్ధికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తప్పుపట్టారు. ఇలాంటి అంశాలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి, హోం మంత్రి, ముఖ్యమంత్రులు వాడుకోరాదని సూచించారు. యోగి సర్కార్ ఆదేశాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. ఈ అంశాన్ని కోర్టు సుమోటాగా విచారణకు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను సామాజిక నేరంతో ఆయన పోల్చారు. ఇలాంటి ఆదేశాల వల్ల ఈ ప్రాంతంలోని శాంతియుత వాతావరణం క్షీణిస్తుందన్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి సైతం అత్యుత్సాహం కలిగిన కొందరు అధికారులు ఇచ్చే ఆదేశాల వల్ల అంటరానితనమనే వ్యాధి ప్రబలే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. మత విశ్వాసాలను గౌరవించాల్సిందేనని, కానీ అంటరానితనాన్ని ప్రోత్సహించరాదని అన్నారు. అయితే, పలువురు బీజేపీ నేతలు మాత్రం యోగి సర్కార్ ఆదేశాలను సమర్ధించారు. ఇందులో సమానత్వమే కానీ రాజ్యాంగ వ్యతిరేకత ఏమీ లేదని బీజేపీ ఎంపీ నిషికాంత్ డూబే వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అంతా తమ దుకాణాల ముందు నేమ్‌ప్లేట్లు ప్రదర్శిస్తారని, చట్టాన్ని బీజేపీ గౌరవిస్తుందని చెప్పారు.