Share News

Shyam Rangeela: మోదీపై నామినేషన్‌కు నన్ను అనుమతించలేదు.. కెమెడియన్ శ్యామ్ రంగీలా సంచలన పోస్ట్

ABN , Publish Date - May 14 , 2024 | 04:23 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేయడంలో పేరున్న యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలాకు చేదు అనుభవం ఎదురైంది. నరేంద్ర మోదీ మంగళవారంనాడు నామినేషన్ వేసిన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్‌ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు.

Shyam Rangeela: మోదీపై నామినేషన్‌కు నన్ను అనుమతించలేదు.. కెమెడియన్ శ్యామ్ రంగీలా సంచలన పోస్ట్

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేయడంలో పేరున్న యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలా (Shyam Rangeela)కు చేదు అనుభవం ఎదురైంది. నరేంద్ర మోదీ మంగళవారంనాడు నామినేషన్ వేసిన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్‌ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. మే 10వ తేదీ శుక్రవారం నుంచి వారణాసిలో నామినేషన్ వేసేందుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయమని, మంగళవారం కూడా తనను జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి అనుమతించలేదని ఆయన తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.


''వారు నా పేపర్లను తోసిపుచ్చవచ్చు. కానీ కనీసం డాక్యుమెంట్లు తీసుకుని ఉండొచ్చు'' అని రంగీలా వాపోయారు. వారణాసిలో నామినేషన్ వేయడానికి మంగళవారంతో గడవు ముగిసింది. చివరి రోజు వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ వేశారు. ఈ నియోజకవర్గం నుంచి 2014లో 3.72 లక్షల ఓట్లు, 2019లో 4.8 లక్షల ఓట్ల మెజారిటీతో మోదీ గెలుపొందారు. హ్యాట్రిక్ విజయం కోసం ఇక్కడి నుంచి మరోసారి ఆయన బరిలోకి దిగారు. మోదీకి ముందు వారణాసి నియోజకవర్గం నుంచి 14 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, బీఎస్‌పీ అభ్యర్థి అథర్ ఆలి ఇందులో ఉన్నారు.

PM Modi Live: వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ


శ్యామ్ రంగీలా పోస్ట్‌పై కాంగ్రెస్ స్పందన

వారణాసి నుంచి తనను నామినేషన్ వేయడానికి అనుమతించ లేదంటూ శ్యామ్ రంగీలా చేసిన పోస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. ప్రధాని మోదీతో సహా ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసే హక్కు ఉందని, అయితే ఈ నియోజకవర్గం నుంచి ఇతర వ్యక్తులను పోటీ చేయడానికి అనుమతించడం లేదని ఆ పార్టీ ఆరోపించింది. రంగీలా (శ్యామ్) అనే యూ ట్యూటర్ వారణాసి నుంచి నామినేషన్ వేయాలనుకుంటే జిల్లా యంత్రాగం నుంచి నామినేషన్ పత్రాలు పొందలేకపోయాడని, ప్రజలను చూసి మోదీ ఎందుకు భయపడుతున్నారని ఆ పార్టీ నేత సురేంద్ర రాజ్‌పుత్ ప్రశ్నించారు. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారిని పోటీ చేయనీయండని వ్యాఖ్యానించారు.


ఎవరీ శ్యామ్ రంగీలా?

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో పుట్టి, పెరిగిన 29 ఏళ్ల శ్యామ్ రంగీలా యానిమేషన్ కోర్సు చేశారు. మిమిక్రీలో, ముఖ్యంగా రాజకీయ నాయకులను అనుకరించడంలో మంచి నేర్పరిగా పేరు తెచ్చుకున్నారు. ''ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'' అనే టీవీషోతో ఆయన పాపులర్ అయ్యారు. మోదీతో పాటు రాహుల్ గాంధీ వంటి ప్రముఖుల ప్రసంగాలను కూడా మిమిక్రీతో ఆయన అనుకరించేవారు. కొద్దికాలంగా మోదీ, ఆయన విధానాలపై విమర్శకుడిగా రంగీలా మారినట్టు ఆయన చేసిన పలు వీడియోలు చెబుతున్నాయి. వారణాసి నుంచి మోదీపై తాను పోటీ చేయనున్నట్టు మే 1న రంగీలా ప్రకటించారు.

Read Latest Telangana News and National News

Updated Date - May 14 , 2024 | 04:23 PM