PM Kanyakumari retreat: మోదీ 'కోడ్' ఉల్లంఘించారంటూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ABN , Publish Date - May 29 , 2024 | 09:47 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్యాకుమారి పర్యటనలో భాగంగా ఈనెల 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకూ 'ధ్యానం'లో ఉండనున్నట్టు ప్రకటించడంపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎన్నికల అధికారులకు తెలియజేసింది.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కన్యాకుమారి పర్యటనలో భాగంగా ఈనెల 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకూ 'ధ్యానం'లో ఉండనున్నట్టు ప్రకటించడంపై ఎన్నికల కమిషన్ (EC)కు కాంగ్రెస్ (Congress) పార్టీ ఫిర్యాదు చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎన్నికల అధికారులకు తెలియజేసింది. ఈమేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రతినిధి బృందంలో ఒకరైన సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి మీడియాకు తెలిపారు.
''48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ ఎవరినీ ఎలాంటి ప్రచారానికి అనుమతించరాదని ఎన్నికల కమిషన్‌కు విన్నవించాం. ఎవరు ఎలా ఉండాలనుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మౌన వ్రతం పాటించవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. కానీ సైలెన్స్ పీరియడ్‌లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగానీ ఎలాంటి ప్రచారం సాగించరాదు. మే 30వ తేదీ నుంచి మౌన వ్రతంలో కూర్చుంటానని మోదీ ప్రకటించడంపై మేము ఫిర్యాదు చేశాం. మే 30వ తేదీ 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. మోదీ ప్రకటన ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. తనను తాను ప్రచారంలో ఉంచునేందుకు, పతాక శీర్షికల్లో ఉండేందుకు వేసిన ఎత్తుగడ ఇది. జూన్ 1 తేదీ సాయంత్రం తర్వాత మౌన వ్రతం చేసుకునేలా ఆయనను ఆదేశించాల్సిందిగా ఈసీని మేము కోరాం. అలాకాకుండా మే 30వ తేదీ ఉదయం నుంచే మౌనవ్రతం ప్రారంభిస్తానని ఆయనపట్టుబడితే అందుకు సంబంధించిన సమాచారం ప్రింట్, ఆడియో, విజువల్ మీడియాలో టెలికాస్ట్ కాకుండా నిషేధం విధించాలని ఈసీకి విన్నవించాం' అని అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. మోదీపై కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.