జిలేబీ రాజకీయం!
ABN , Publish Date - Oct 09 , 2024 | 05:06 AM
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ జోరు కనిపించగానే.. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం పెద్ద ఎత్తున జలేబీలు (జిలేబీ) తెప్పించి పంచిపెట్టింది!
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ జోరు కనిపించగానే.. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం పెద్ద ఎత్తున జలేబీలు (జిలేబీ) తెప్పించి పంచిపెట్టింది! కట్ చేస్తే.. కాసేపట్లోనే సీన్ మారింది. ఫలితాల్లో కాంగ్రెస్ జోరు తగ్గి బీజేపీ సీట్ల సంఖ్య పెరగడం మొదలుపెట్టగానే.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కూడా జిలేబీలతో నోరు తీపి చేసుకుని సంబరాలు చేసుకున్నారు! ఈ జిలేబీలకో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా తరహాలో.. హరియాణాలో ‘గోహానా జలేబీ’ ప్రఖ్యాతి గాంచిన మిఠాయి! ఆ ప్రాంతానికి చెందిన మాతూరామ్ అనే వ్యక్తి 1958 నుంచి జిలేబీలు విక్రయించడం ప్రారంభించారు. అనతికాలంలోనే అదో బ్రాండ్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. రాహుల్‌గాంధీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జిలేబీల బాక్సును చేతిలో పట్టుకుని.. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా మాతూరామ్ వంటి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని.. తాము అధికారంలోకి వస్తే వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని.. ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ జలేబీని ఇతర రాష్ట్రాల్లోనూ అమ్మగలిగితే? ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే? మరో 20 వేల నుంచి 50 వేల మందికి ఉపాధి దొరుకుతుంది కదా’’ అన్నారు! అప్పట్నుంచీ ఎన్నికలు ముగిసేదాకా.. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తన గెలుపు సంబరాలను జిలేబీతో ప్రారంభించగా.. ఆ పార్టీని వెక్కిరిస్తున్నట్టుగా బీజేపీ తన సంబరాలను జిలేబీతో ముగించింది!!