Lok Sabha Elections: దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర... కాంగ్రెస్ అభ్యర్థి 'గోవా' వ్యాఖ్యలపై మోదీ ఫైర్
ABN , Publish Date - Apr 23 , 2024 | 09:29 PM
గోవాపై భారత రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారంటూ దక్షిణ గోవా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విరీయటో ఫెర్నాండెజ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: గోవా (Goa)పై భారత రాజ్యాంగాన్ని (Indian constitution) బలవంతంగా రుద్దారంటూ దక్షిణ గోవా కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా పోటీ చేస్తున్న విరీయటో ఫెర్నాండెజ్ (Viriato Fernandes) చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఘాటుగా స్పందించారు. దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు.
పోర్చుగీస్ నుంచి విముక్తి పొందిన తర్వాత ఎవరితో ఉండాలో గోవా నిర్ణయించుకుంటుందని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారని, అయితే అది ఎప్పటికీ నోచుకోలేదని, రాష్ట్రంపై భారత రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారని ఫెర్నాండెజ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ స్పందించారు. స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజు నుంచే బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టుందని, దేశానికి చెందిన ఎంతో భూభాగాన్ని వదులుకుందని ఆరోపించారు. ఆకారణంగానే చిన్న చిన్న ద్వీపాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కోరుకుంటోందని దుయ్యబట్టారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల వారు అధికారంలో పాలుపంచుకోవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకుందని, ఇప్పుడు మరో పెద్ద ఆటకు తెరలేపిందని అన్నారు.
Lok Sabha Elections 2024: మోదీ, అమిత్‌షాలను 'జై-వీరు'లతో పోల్చిన హేమమాలిని
దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఇంతకముందు కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారని, ఇప్పుడు గోవాకు చెందిన కాంగ్రెస్ నేత గోవాకు భారత రాజ్యాంగం వర్తించదని చెబుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు. ఇది బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానించడం కాదా? రాజ్యాంగానికి జరుగుతున్న అవమానం కాదా? భారత రాజ్యాంగాన్ని ట్యాంపరింగ్ చేయడం కాదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మొప్పుకోసమే గోవా కాంగ్రెస్ అభ్యర్థి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు అనుకోవాల్సి వస్తోందన్నారు. ఈరోజు గోవాలో రాజ్యాంగాన్ని తోసిపుచ్చుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు యావద్దేశం విషయంలో ఇలాంటి పాపానికి ఒడిగట్టదని చెప్పలేమని అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నాయని ప్రధాని తప్పుపట్టారు.
Read Latest National News and Telugu News