Lok sabha Elections: 5 సీట్లు కోరుతున్న కాంగ్రెస్, మూడే కష్టమంటున్న టీఎంసీ
ABN , Publish Date - Feb 23 , 2024 | 04:19 PM
'ఇండియా' కూటమి పార్టీలతో పొత్తులను కొలిక్కి తెస్తున్న కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు ఖరారుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 5 లోక్‌సభ సీట్లు కావాలని కాంగ్రెస్ మొదట్నించీ పట్టుపడుతుండగా, రెండు సీట్లు మినహా ఇవ్వలేమంటూ టీఎంసీ కరాఖండిగా చెబుతూ వస్తోంది.
న్యూఢిల్లీ: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి పార్టీలతో పొత్తులను కొలిక్కి తెస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ పశ్చిమబెంగాల్ (West Bengal)లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)తో పొత్తు ఖరారుకు తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 5 లోక్‌సభ సీట్లు కావాలని కాంగ్రెస్ మొదట్నించీ పట్టుపడుతుండగా, రెండు సీట్లు మినహా ఇవ్వలేమంటూ టీఎంసీ కరాఖండిగా చెబుతూ వస్తోంది.
టీఎంసీ వాదన..
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లోక్‌సభ సీట్లు గెలుచుకోగా, 2021 రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చాలా స్పష్టంగా పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీకి గుణపాఠం చెప్పగలిగేది టీఎంసీ మాత్రమేనని అన్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేదని, అయినప్పటికీ రెండు లోక్‌సభ సీట్లు ఆఫర్ చేసి ఆ రెండిట్లోనూ గెలిపిస్తామని హామీ ఇచ్చామని, అందుకు ఆ పార్టీ నిరాకరించిందని చెప్పారు. దీంతో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేయాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చిందని, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ కోరుతున్న సీట్లేంటి?
కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెర్హంపూర్, మాల్డా (సౌత్) లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఆ రెండు సీట్లతో పాటు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్న డార్జిలింగ్, మాల్డా (ఉత్తర), రాయ్‌గంజ్ సీట్లలో పోటీకి కాంగ్రెస్ 'సై' అంటోంది. ఆ మూడు సీట్లు తమకు ఇవ్వాలని టీఎంసీని కాంగ్రెస్ కోరుతోంది. దీనిపై టీఎంసీ ప్రతినిధి ఒకరు శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, బైనాక్యులర్ వేసి చూసినా కాంగ్రెస్‌కు మూడో సీటు ఇచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. అయితే, ఏకాభిప్రాయం అంటూ కుదిరిదే మాత్రం పొత్తులపై త్వరలోనే ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు.