Share News

Congress vs SP: పొత్తులపై పీటముడి...పేచీ ఎక్కడొచ్చిందంటే?

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:53 PM

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్‌లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు పట్టువిడుపులు లేని ధోరణిలో వ్యవహరించడంతో పొత్తుకు అవకాశాలు దాదాపు లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Congress vs SP: పొత్తులపై పీటముడి...పేచీ ఎక్కడొచ్చిందంటే?

లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), సమాజ్‌వాదీ పార్టీ (SP) మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్‌లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు పట్టువిడుపులు లేని ధోరణిలో వ్యవహరించడంతో పొత్తుకు అవకాశాలు దాదాపు లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఈ విషయాన్ని రెండు పార్టీలు ప్రకటించలేదు.


కాంగ్రెస్ పార్టీతో సీట్ల షేరింగ్ వ్యవహారం ఖరారయ్యేంత వరకూ రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో తమ పార్టీ పాల్గొనేది లేదని ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దాదాపు అన్ని సీట్లలోనూ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, మొరాదాబాద్ నియోజకవర్గం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గక పోవడంతో పీటముడి పడిందని చెబుతున్నారు. బిజ్నోర్ సీటును కాంగ్రెస్ కోరుతుండగా, మొరాదాబాద్ కానీ, బిజ్నోర్‌ కానీ ఇచ్చేందుకు ఎస్‌పీ నిరాకరిస్తోంది. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన తలెత్తి, పొత్తు పెటాకులయ్యే పరిస్థితి బలంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇరు పార్టీలు గట్టిగా పట్టుబడుతున్న సీట్లు మినహాయించి 17 లోక్‌సభ సీట్లు కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఎస్‌పీ సోమవారంనాడు ప్రతిపాదన చేసింది. అయితే కాంగ్రెస్ కనీసం 20 సీట్ల కోసం పట్టుబడుతోంది. అంతకుముందు 11 సీట్లు కాంగ్రెస్‌కు ఆఫర్ చేసినప్పటికీ ఆ పార్టీ మరిన్ని సీట్ల కోసం పట్టుబట్టింది. కాగా, కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిన కీలక నియోజకవర్గాల్లో అమేథి, రాయబరేలి, వారణాసి, ప్రయాగ్‌రాజ్, డియోరియా, బాన్స్‌గావ్, మహారాజ్‌గంజ్, బారాబంకి, కాన్పూర్, ఝాన్సీ, మథుర, ఫతేపూర్ సిక్రి, ఘజియాబాద్, బులంద్‌షహర్, హథ్రాస్, షహరాన్‌పూర్ ఉన్నాయి.

Updated Date - Feb 20 , 2024 | 02:56 PM