Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా కూడా దక్కదు.. మోదీ జోస్యం
ABN , Publish Date - May 11 , 2024 | 03:41 PM
భారతీయ జనతా పార్టీ తొలిసారి ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో ఎన్డీయే గెలువనుందని, విపక్షంలో కూర్చునేందుకు అవసరమైన సీట్లు కూడా కాంగ్రెస్‌కు రావని చెప్పారు.
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ (BJP) తొలిసారి ఒడిశా (Odisha) అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. మే 13న ఒడిశాలో కీలకమైన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంధమాల్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో ఎన్డీయే గెలువనుందని, విపక్షంలో కూర్చునేందుకు అవసరమైన సీట్లు కూడా కాంగ్రెస్‌కు రావని చెప్పారు.
కాంగ్రెస్‌కు 50 సీట్ల కంటే తక్కువే..
''జూన్ 4న ఎన్డీయేకు 400కు పైగా సీట్లను కట్టబెట్టేందుకు దేశ ప్రజలు స్థిరనిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్‌కు విపక్షంలో కూర్చునేందుకు అవసరమైన సీట్లు కూడా రావు. 50 కంటే తక్కువ సీట్లే వారికి వస్తాయి'' అని మోదీ అన్నారు.
ఒడిశా ప్రజలు తన పట్ల అపారమైన ప్రేమ, మద్దతు కనబరుస్తున్నారని, ప్రజలు తనమీద ఉన్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా నిస్వార్థ సేవ చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. 26 ఏళ్ల క్రితం ఈరోజే అటల్ బిహార్ వాజ్‌పేయి ఇక్కడ పోఖ్రాన్ పరీక్ష నిర్వహించారని, అది ప్రపంచంలోని భారతీయులందరికీ గర్వకారణమైందని గుర్తు చేశారు. ప్రపంచానికి భారతదేశ సత్తాను తొలిసారి చాటిన సందర్భమిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పాకిస్థాన్ దగ్గర కూడా అణుశక్తి ఉందంటూ భారతీయుల మనసుల్లో భయాలు నాటుతోందని ఎద్దేవా చేశారు.
Congress: ఎన్నికల వేళ ఖర్గే భారీ హామీ.. ఆ రంగంలో దేశాన్ని టాప్‌లో నిలుపుతామని స్పష్టీకరణ
కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఉగ్రదాడులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఓటు బ్యాంకు భయాలే అందుకు కారణమమని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ బలహీనమైన మైండ్‌సెట్ కారణంగానే జమ్మూకశ్మీర్ ప్రజలు దశాబ్దాలుగా బాధితులయ్యారని అన్నారు. 26/11 దాడుల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు భయాలతో ఎలాంటి దర్యాప్తు జరిపించలేదన్నారు.
వికసిత్ భారత్‌లో వికసిత్ ఒడిశా కోసం ప్రజల ఓటు చాలా ముఖ్యమని, మీ ఒక్క ఓటుతో ఇక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కమలం బటన్ నొక్కి బీజేపీ అభ్యర్థి విజయానికి సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు.
Read Latest National News and Telugu News