Share News

Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Sep 08 , 2024 | 05:42 PM

బిహార్‌లో మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బాక్సర్ జిల్లాలోని ట్వినిగంజ్ - రఘునాథ్‌పూర్ స్టేషన్ల మధ్య న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది.

Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

పాట్నా, సెప్టెంబర్ 08: బిహార్‌లో మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బాక్సర్ జిల్లాలోని ట్వినిగంజ్ - రఘునాథ్‌పూర్ స్టేషన్ల మధ్య న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. ఆదివారం ఉదయం 11.08 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తూర్పు మధ్య రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: Video Viral: వీడెవడండీబాబు.. వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లాడు..


ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సాంకేతిక బృందం ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టిందని తెలిపారు. ఇక ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆ రైల్వే ట్రాక్‌పైకి ఇతర రైళ్లు ఏవి రాలేదని చెప్పారు. దాంతో పెను ప్రమాదమే తప్పిందని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ట్వినిగంజ్ రైల్వే స్టేషన్ దాటిన అనంతరం ఈ ఘటన జరిగిందని వివరించారు.

Also Read: Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ


మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని కోచ్ నెంబర్ S 6, S 7 బోగీల మధ్య కప్లింగ్ ఉడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఈ మార్గంలో వెళ్ల వలసిన పలు రైళ్లు మరో మార్గంలో మళ్లించామన్నారు. దాదాపు మూడు గంటల అనంతరం మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇస్లాంపూర్‌కు బయలుదేరి వెళ్లిందని వెల్లడించారు. ఆ తర్వాత ఈ మార్గంలో రైళ్లను పునరుద్దరించినట్లు వివరించారు. ఈ ఘటనపై విచారణకు రైల్వే బోర్డు ఆదేశించింది.


దేశవ్యాప్తంగా ఇటీవల భారీగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం సైతం సంభవిస్తుంది. ఈ ప్రమాదాలకు మోదీ ప్రభుత్వమే కారణమని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగం సంస్థ భారతీయ రైల్వే. అలాంటి రైల్వేల్లో భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడంపై సర్వత్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 08 , 2024 | 05:48 PM