Cyber Crime: పాక్ నుంచి సైబర్ నేరగాళ్ల బెదిరింపు యూపీలో టీచర్ మృతి
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:38 AM
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ బెదిరింపు ఫోన్ కాల్‌కు తీవ్ర ఆందోళన చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.
కుమార్తె సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుందంటూ
ఫోన్.. రూ.లక్ష పంపించాలని డిమాండ్
అది ఫేక్ కాల్ అని కుమారుడు చెప్పినా
తగ్గని ఆందోళన.. గుండెపోటుతో మృతి
న్యూఢిల్లీ, అక్టోబరు 4: పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ బెదిరింపు ఫోన్ కాల్‌కు తీవ్ర ఆందోళన చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న మాలతి వర్మకు గత నెల 30వ తేదీన ఓ ఫోన్ వచ్చింది. ‘మీ కూతురు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుంది. ఇప్పటి వరకూ ఆమె మీద కేసు నమోదు చేయలేదు. మీ పరువు ప్రతిష్ఠలు మంటగలవకూడదంటే రూ.లక్ష పంపించండి’ అని గుర్తు తెలియని వ్యక్తి ఒకడు బెదిరించాడు. ఆ కాల్ ప్రొఫైల్ పిక్చర్‌గా.. పోలీసు అధికారిలా డ్రెస్సు వేసుకున్న వ్యక్తి ఫొటో ఉంది. దీంతో నిజంగానే ఎవరో పోలీసు తనకు ఫోన్ చేశాడనుకొని తీవ్ర ఆందోళన చెందిన మాలతి.. తన కుమారుడికి ఫోన్ చేసి జరిగింది చెప్పారు. కాల్ ఏ ఫోన్ నుంచి వచ్చిందో ఆ నెంబరు తెలియజేశారు.
సదరు నెంబరు +92తో ప్రారంభం కావటంతో, అది పాకిస్థాన్ నుంచి వచ్చిన కాల్ అని మాలతి కుమారుడికి అర్థమైంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి ఇలా సైబర్ నేరగాళ్లు పోలీసుల్లాగా ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని, భయపడొద్దని తల్లికి ధైర్యం చెప్పాడు. కానీ, మాలతి ఆందోళన తగ్గలేదు. అదే బాధతో స్కూల్ నుంచి ఇంటికొచ్చారు. వస్తూనే తీవ్రమైన ఒత్తిడికి లోనై గుండెపోటుతో కుప్పకూలారు. చుట్టుపక్కలవాళ్లు పరిగెత్తుకొచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మాలతి మరణించారు.
మరో ఘటనలో ముంబైకి చెందిన ఓ 31 ఏళ్ల మహిళ.. సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.6 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 26వ తేదీన ఏటీఎంకు వెళ్లిన సదరు మహిళ.. తన మొబైల్‌లోని బ్యాంకు యాప్ ద్వారా కార్డుతో ప్రమేయం లేకుండా రూ.5 వేలు తీసుకోవటానికి ప్రయత్నించారు. అయితే, డబ్బులు రాలేదు కానీ, సీఎం సహాయనిధికి రూ.5 వేలు వెళ్లిపోయాయని సెల్‌కు మెసేజ్ వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేయటానికి ఇంటర్నెట్‌లో వెదుకుతున్న క్రమంలో ఆమె సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమెకు సహాయం చేస్తామంటూనే వాళ్లు ఆమె బ్యాంకు వివరాలు, పాస్‌వర్డు తెలుసుకొని ఖాతా నుంచి రూ.6 లక్షలు విత్‌డ్రా చేశారు.