Delhi : 20 రోజుల్లో 14 మంది చిన్నారుల మృతి
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:48 AM
ఢిల్లీలోని ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 20 రోజుల వ్యవధిలో 14 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేకెత్తిస్తోంది. వారి మరణాలకు కారణాలేంటన్నది ఇంకా తెలియక పోవడం గమనార్హం.
ఢిల్లీలోని ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఘటన
న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఢిల్లీలోని ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 20 రోజుల వ్యవధిలో 14 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేకెత్తిస్తోంది. వారి మరణాలకు కారణాలేంటన్నది ఇంకా తెలియక పోవడం గమనార్హం.
రోహిణి ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం మానసిక వికలాంగుల కోసం ఆశాకిరణ్ షెల్టర్ హోం నడుపుతోంది. అయితే గత 20 రోజుల్లోనే ఈ షెల్టర్‌లో ఉంటున్న వారిలో 14 మంది మృత్యువాత పడడంతో ఆందోళన చెలరేగింది.
ఈ మరణాలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు. అలాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అన్ని షెల్టర్ హోంలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఎల్జీ ఆదేశించినట్లు రాజ్‌నివాస్ వెల్లడించింది.
షెల్టర్‌లో మరణాల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని తెలిస్తే సహించబోమని ఢిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. ఘటనపై మెజిస్ట్రియల్ దర్యాప్తుకు ఆదేశించామని, 24 గంటల్లో ప్రాథమిక నివేదిక వస్తుందని చెప్పారు.
మరణాల నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం మీద జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. కాగా, బీజేపీ నేతలు ఆశాకిరణ్ షెల్టర్ హోం వద్ద ఆందోళన చేపట్టారు. షెల్టర్‌లో పిల్లలకు శుభ్రమైన నీరు, సరిపడా భోజనం, వైద్యం అందించడం లేదని తమకు తెలిసిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.