Share News

Air Pollution: రాజధాని ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం

ABN , Publish Date - Sep 09 , 2024 | 06:10 PM

పెరుగుతున్న వాయు కాలుష్యం(Air Pollution) దేశంలోని అభివద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు సవాలు విసురుతోంది. ఏటా వాయుకాలుష్యం బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

Air Pollution: రాజధాని ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం

ఇంటర్నెట్ డెస్క్: పెరుగుతున్న వాయు కాలుష్యం(Air Pollution) దేశంలోని అభివద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు సవాలు విసురుతోంది. ఏటా వాయుకాలుష్యం బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కాలుష్యం వల్ల వివిధ రోగాలబారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాలు ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. అయితే అన్నింటికంటే ఎక్కువగా ఢిల్లీ నగరం వాయు కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. అక్కడి ప్రభుత్వం వాయుకాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని చాలానే చూస్తున్నా.. సమస్య కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే సరిబేసి విధానంలో వాహనాలు నడిపే పద్ధతిని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. కాలుష్య కట్టడికి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.


ఎప్పటిలాగే వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు దీపావళి వేడుకలపై కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలు విధించింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకుగానూ రాజధానిలో పటాకుల ఉత్పత్తి, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకం, సరఫరాపై కూడా నిషేధం వర్తిస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖల సహకారంతో ప్రణాళికను సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగంపై జనవరి 1, 2025 వరకు నిషేధం అమలులో ఉంటుందని రాయ్ ప్రకటనలో పేర్కొన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం 21 ఫోకస్‌ పాయింట్ల ఆధారంగా శీతాకాల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు.


ఇదీ పరిస్థితి..

దేశంలో ప్రధాన నగరాల్లో రోజువారీ సంభవించే మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలు వాయుకాలుష్యం వల్లనే సంభవిస్తున్నాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఉంది. ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌’లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. వారణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ క్రానిక్‌ డిసీజెస్‌ కంట్రోల్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన పరిశోధన సంస్థలతో కూడిన ఒక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది.

ఢిల్లీలో పీఎం 2.5 కాలుష్యం అత్యధికంగా 113 స్థాయిలో ఉండగా, అక్కడి రోజువారీ మరణాల్లో 11.5 శాతం మరణాలకు వాయుకాలుష్యం కారణమవుతోంది. హైదరాబాద్‌లో పీఎం 2.5 38.9 ఉండగా, రోజువారీ మరణాల్లో 5.6 శాతం వాయుకాలుష్యం వల్ల సంభవిస్తున్నాయి. మొత్తం 10 నగరాల్లో షిమ్లాలో పీఎం 2 కాలుష్యం అత్యల్పగా 28.4 స్థాయిలో ఉంది. అక్కడి రోజువారీ మరణాల్లో వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్నవి 3.7 శాతమే.

For Latest News and National News Click Here

Updated Date - Sep 09 , 2024 | 06:10 PM