Delhi : ఆశలు జలసమాధి
ABN , Publish Date - Jul 29 , 2024 | 05:26 AM
సివిల్స్ సాధించాలనే తమ కలలను సాకారం చేసుకునేందుకు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారా ముగ్గురూ! ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసుల్లో చేరి ఏదో సాధించాలని ఆశపడ్డారు. కానీ.. తమ లక్ష్యాన్ని చేరుకునేలోపే.. చదువులో నిమగ్నమై..జలసమాధి అయిపోయారు.
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్
బేస్‌మెంట్‌లోకి భారీగా పోటెత్తిన వరద నీరు
పార్కింగ్, స్టోర్‌రూమ్‌గా వాడాల్సిన చోట లైబ్రరీ
ఘటనలో ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతి
మృతుల్లో.. బిహార్‌కు చెందిన తానియా సోని
24 ఏళ్లుగా సింగరేణిలో పనిచేస్తున్న ఆమె తండ్రి
కోచింగ్ సెంటర్ యజమాని సహా ఇద్దరి అరెస్ట్
సోని మృతిపై సీఎం రేవంత్, కిషన్‌రెడ్డి దిగ్ర్భాంతి
వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ దారుణం: రాహుల్
నా బాధ చెప్పడానికి మాటలు రావట్లేదు. గొంతు పెగలట్లేదు. తానియా సోని నా పెద్ద కుమార్తె. ఏదో సాధించాలని పెద్ద పెద్ద కలలు కనేది. నా బిడ్డ ఇలా చనిపోతుందని ఊహించలేదు. ఇప్పుడేం చేయాలో కూడా మాకు తోచట్లేదు.
- విజయ్‌కుమార్ (తానియాసోని తండ్రి)
న్యూఢిల్లీ, హైదరాబాద్, శ్రీరాంపూర్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సివిల్స్ సాధించాలనే తమ కలలను సాకారం చేసుకునేందుకు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారా ముగ్గురూ! ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసుల్లో చేరి ఏదో సాధించాలని ఆశపడ్డారు. కానీ.. తమ లక్ష్యాన్ని చేరుకునేలోపే.. చదువులో నిమగ్నమై..జలసమాధి అయిపోయారు.
దేశరాజధాని ఢిల్లీలో శనివారం జరిగిందీ దుర్ఘటన. సెంట్రల్ ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్ కోచింగ్ సెంటర్లకు ప్రధాన కేంద్రం. దేశం నలుమూలల నుంచి సివిల్స్ సహా ఇతర కోచింగ్‌ల కోసం విద్యార్థులు వస్తుంటారు. అక్కడే రావూస్ ఐఏఎస్ అకాడమీ కూడా ఉంది.
శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో.. కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు పోటెత్తింది. ఆ సమయంలో కొందరు విద్యార్థులు ఆ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్నారు. వారంతా చదువులో నిమగ్నమై ఉండగా వరద నీరు చుట్టుముట్టింది.
అక్కడ ఉన్నవారిలో కొంతమంది తప్పించుకోగా.. బిహార్‌కు చెందిన తానియా సోని (25), ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయ యాదవ్ (25), కేరళకు చెందిన నెవిన్ డాల్విన్ (28) మృతి చెందారు.
విషయం తెలియగానే ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని.. వరదలో చిక్కుకున్న విద్యార్థులను బయటికి తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
కాగా తానియా సోని.. తండ్రి విజయ్ కుమార్ బిహార్‌లోని ఔరంగాబాద్ ప్రాంతవాసి. 24 సంవత్సరాలుగా ఆయన సింగరేణిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల్ జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్పీ1 గనిలో సీనియర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె తానియా సోని డిగ్రీ, పీజీ ఢిల్లీలోనే పూర్తిచేసింది.
సివిల్స్ కోచింగ్ కోసం ఈ ఏడాదే రావూ్‌సలో చేరింది. ఈ ప్రమాదంలో ఆమె మరణించిందన్న విషయం తెలియగానే విజయ్‌కుమార్ కుటుంబం వెంటనే బయల్దేరి నాగపూర్‌కు చేరుకుని.. అక్కణ్నుంచీ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. కాగా.. ఈ ప్రమాదం నేపథ్యంలో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, సెంటర్ కో-ఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స)లోని 105, 106(1), 115(2), 290, 35 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను.. కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో శ్రేయ యాదవ్ మరణించిన విషయాన్ని తాను న్యూస్ చానళ్ల ద్వారానే తెలుసుకున్నానని ఆమె బంధువు ధర్మేందర్ యాదవ్ తెలిపారు. ‘ఆమెతో ఫోన్‌లో మాట్లాడడానికి నేను ప్రయత్నించాను.
కానీ స్విచాఫ్ వచ్చింది. కోచింగ్ సెంటర్ నంబర్ కూడా పనిచేయలేదు. దీంతో వెంటనే ఘజియాబాద్ నుంచి బయల్దేరి ఢిల్లీకి చేరుకుని ఆమె రూమ్‌కు వెళ్లాను. ఆ గదికి తాళం వేసి ఉంది. ఆమె కోసం అకాడమీకి వెళ్తే.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. అక్కడికి వెళ్తే.. ఆమె మృతదేహాన్ని చూపార’’ని వాపోయారు. ప్రమాదం శనివారం సాయంత్రం జరిగితే.. ఆదివారం మధ్యాహ్నం దాకా మృతదేహాలను తమకు చూపలేదని మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్కింగ్ స్థలంలో లైబ్రరీ
రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ కోచింగ్ సెంటర్‌కు సంబంధించి 2021లో మూడంతస్తుల భవన నిర్మాణ ప్లాన్‌కు అనుమతి తీసుకున్నారు.
సెల్లార్‌ను పార్కింగ్, సరకు నిల్వ (స్టోర్ రూమ్) కోసమే వినియోగిస్తామని చెప్పి.. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం కూడా తీసుకున్నారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. శనివారం సాయంత్రం 7.10 గంటల సమయంలో ఈ ఘటన గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదుగురు నీటిని తోడిపోసే యంత్రాలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
కానీ, లోపలి నుంచి నీరు తోడి బయటకు పోద్దామంటే.. అప్పటికే వాననీటితో రోడ్డు నిండిపోయింది. దీంతో ఆ నీరు పోయేదాకా వేచి ఉండి, ఆ తర్వాత బేస్‌మెంట్‌లోంచి నీటిని బయటకు పంప్ చేశామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు ఆప్ మంత్రి అతిశీ తెలిపారు. మరోవైపు.. ఢిల్లీలో నిబంధనలకు ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కొరడా ఝళిపించడం ప్రారంభించింది.
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి పరామర్శ
తానియా సోని మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆమె తండ్రి విజయ్‌కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు. ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి.. పెండింగ్ లో ఉన్న అన్ని ఫార్మాలిటీసన్నింటినీ త్వరగా పూర్తిచేయడంలో చొరవ తీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా జరిగిన ఘటనలపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో మాట్లాడిన రేవంత్.. మృతుల్లో ఎవరైనా రాష్ట్రవాసులు ఉంటే బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.
దీనికి గౌరవ్.. తెలంగాణ వాసులెవరూ లేరని, మృతుల్లో తానియా సోని బిహార్‌కు చెందిన యువతి అని, ఆమె తండ్రి విజయ్‌కుమార్ సింగరేణిలో సీనియర్ మేనేజర్‌గా మంచిర్యాలలో విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. దీంతో.. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయసహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు.
వ్యవస్థల వైఫల్యంవల్లే: రాహుల్
రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ను వరద నీరు ముంచెత్తిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. ‘‘ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లో నీరు చేరి పోటీ పరీక్షలకు సిద్థమవుతున్న విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. నిర్మాణం సరిగా లేకపోవడం, ప్రణాళికలోపం, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. సురక్షితంగా, సౌకర్యవంతంగా జీవించడం ప్రతి పౌరుడి హక్కు. దానిని అందించడం ప్రభుత్వాల బాధ్యత’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
స్వాతి మాలివాల్‌కు చేదు అనుభవం
రావూస్ కోచింగ్ సెంటర్ విషాదం గురించి తెలియగానే ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఘటనా స్థలానికి వెళ్లారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్లగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పలువురు విద్యార్థులు ఆమెపై మండిపడ్డారు. ఈ అంశానికి రాజకీయ రంగు పులమవద్దని నినాదాలు చేశారు. ఆ తర్వాత స్వాతి మలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని, వీటిని ‘హత్య’లుగానే భావించాలని అన్నారు. బాధ్యులైన ప్రభుత్వ అధికారులందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, మృతుల కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.