Swati Maliwal: ఎట్టకేలకు.. బిభవ్ కుమార్ అరెస్ట్
ABN , Publish Date - May 18 , 2024 | 12:50 PM
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ను ఈ రోజు (శనివారం) అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే..?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మాలివాల్ ఇంటికెళ్లారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చొన్న తనపై బిభవ్ కుమార్ విచక్షణరహితంగా దాడి చేశారని, కాలితో తన్నారని ఆరోపించారు. ఆ తర్వాత బిభవ్ కుమార్‌పై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ కేసు ఆధారంగా బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
డైలాగ్ వార్
స్వాతి మాలివాల్ ఘటన ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. స్వాతి చేత బీజేపీ మాట్లాడిస్తోందని ఆప్ ఆరోపించింది. ఆప్ నేతల ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. ఆ రోజు ఏం జరిగిందో తెలియజేసేందుకు ఓ వీడియో విడుదల చేసింది. కేజ్రీవాల్ ఇంటి బయట రికార్డైన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కేజ్రీవాల్ నివాసం నుంచి బయటకు వస్తోన్న స్వాతి మాలివాల్ స్పష్టంగా కనిపించారు. బయటకు వచ్చే సమయంలో మహిళ సెక్యూరిటీ సిబ్బంది ఆమె చేయి పట్టుకొని కనిపించారు. మెయిన్ రోడ్డు మీదకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తర్వాత కూడా ఓ పోలీస్ అధికారి రాగా.. అతనితో స్వాతి మాలివాల్ మాట్లాడారు.
Read Latest National News and Telugu News