LG VK Saxena: జైల్లోంచి ప్రభుత్వాన్ని నడపడానికి వీల్లేదు.. కేజ్రీ ఆరెస్టుపై ఎల్జీ
ABN , Publish Date - Mar 27 , 2024 | 04:37 PM
జైల్లోంచి ప్రభుత్వాన్ని నడపకుండా చూస్తామని దేశ రాజధాని ప్రజలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా భరోసా ఇచ్చారు. బుధవారంనాడిక్కడ జరిగిన ఒక సమ్మిట్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన తాజా సమాధానమిచ్చారు.
న్యూఢిల్లీ: జైల్లోంచి ప్రభుత్వాన్ని నడపకుండా చూస్తామని దేశ రాజధాని ప్రజలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వీకే సక్సేనా (VK Saxena) భరోసా ఇచ్చారు. లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కింద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను అరెస్టు చేయడం, జైలు నుంచే ఆయన పాలన సాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ పదేపదే చెబుతుండటంపై ఎల్జీ తాజాగా తన మౌనం వీడారు. ఇక్కడ జరిగిన ఒక సమ్మిట్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, జైలు నుంచి పాలన సాగించకుండా చూస్తామన్నారు. త్వరలోనే హోం మంత్రిత్వ శాఖకు ఈ దిశగా ఆయన సిఫారసు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
మనీలాండరింగ్ కింది కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేయగా, ఈనెల 28 వరకూ ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ అగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే జైలు నుంచి కేజ్రీవాల్ రెండు ఆదేశాలు జారీచేయడం సంచలనమవుతోంది. ఈ ఘటనను ఈడీ కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. కాగితాలు, కంప్యూటర్లు తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయని నిలదీస్తోంది. తదుపరి చర్యలకు కూడా సిద్ధమవుతోంది. కాగా, ఆప్ చర్యపై బీజేపీ మండిపడుతోంది. జైలు నుంచి గ్యాంగ్‌లు పనిచేయడం చూశాం కానీ, ప్రభుత్వాన్ని నడపడం ఎన్నడూ చూడలేదని ఆ పార్టీ నేత మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలను లూటీ చేయడం తప్ప కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అందుకే ఆయన అరెస్టైన వెంటనే ప్రజలు స్వీట్లు పంచుకున్నారని అన్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.