Share News

Delhi : నీట్‌ ఫలితాల్లో.. రాజ్‌కోట్‌ రహస్యం!

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:39 AM

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్‌-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్‌సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..!

Delhi : నీట్‌ ఫలితాల్లో.. రాజ్‌కోట్‌ రహస్యం!

  • ఈ ఒక్క నగరంలో 85% మందికి అర్హత

  • ఒకే కేంద్రంలో 789 మందికి 550 పైనే

  • రాజస్థాన్‌లోనూ అనూహ్య ఫలితాలు

  • సీకర్‌లో 2,037 మందికి 650కిపైనే,

  • 15ు మందికి ప్రభుత్వ సీట్లు!

  • అప్పట్లో హరియాణాలో ఏడుగురికి

  • 720.. ప్రస్తుతం అత్యధిక స్కోరు 682

  • కేంద్రాల వారీగా నీట్‌ ఫలితాల వెల్లడి

  • ప్రిలిమ్స్‌, ఫైనల్స్‌.. నీట్‌లో మార్పులు?

న్యూఢిల్లీ, జూలై 20: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్‌-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్‌సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..! ఈ నగరంలోని ఆర్కే యూనివర్సిటీ అనుబంధ కళాశాల-- స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కేంద్రంలో పరీక్ష రాసినవారి ఫలితాలను పరిశీలిస్తే.. 700-720 మధ్య స్కోరు వచ్చిన వారు 12 మంది ఉన్నారు. 115 మందికి 650-699 మధ్య, 259 మందికి 600-649 మధ్య, 403 మందికి 550-599 మధ్య స్కోర్లు వచ్చాయి..!

రాజ్‌కోట్‌లోని మిగతా కేంద్రాల్లోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రాలు, నగరాల వారీగా జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) శనివారం నీట్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, రాజస్థాన్‌లోని సీకర్‌ నగరాల్లోని కేంద్రాల్లో దిమ్మదిరిగే ఫలితాలు కనిపించాయి. సీకర్‌ నగరంలోని విద్యాభారతి సీకర్‌ కేంద్రంలో 8 మంది 700-720 మధ్య, 69 మంది 650-699 మధ్య, 155 మంది 600-649 మధ్య, 241 మంది 500-599 మధ్య మార్కులను సాధించారు. సీకర్‌లోని మిగతా కేంద్రాల్లోనూ దాదాపు ఇలాంటి ఫలితాలే కనిపించాయి. ఎంతలా అంటే.. ఈ నగరంలోని కేంద్రాల్లో పరీక్షలు రాసిన వారిలో 650-720 మధ్య స్కోరును ఏకంగా 2,037 మంది సాధించారు. ఇక్కడ ఫలితాలు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నీట్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించాలంటే..


720 స్కోరుకు గాను.. 650కి పైనే సాధించాల్సి ఉంటుంది. ఈ కోవలో దేశవ్యాప్తంగా టాప్‌ 30 వేల ర్యాంకులు ఉంటాయి. ఒక్క సీకర్‌ నగరంలోనే 15 శాతం(2,037 మంది) అభ్యర్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటుకు అర్హత సాధించడం గమనార్హం..!

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎ్‌సకు అర్హులయ్యే మిగతా 85ు మంది దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలకు చెందినవారని భావిస్తే.. తప్పులో కాలేసినట్లే..! హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆ స్థాయిలో మార్కులను సాధించారని తాజా ఫలితాలు చెబుతున్నాయి. గతంలో విడుదలైన ఫలితాల్లో హరియాణాలోని హర్‌దయాళ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఏడుగురికి ఏకంగా 100 పర్సంటైల్‌ వచ్చిన విషయం తెలిసిందే..!

గత నెల నిర్వహించిన రీటెస్ట్‌ తర్వాత.. తాజా ఫలితాల్లో మాత్రం ఆ కేంద్రంలో అత్యధిక స్కోరు 682 మాత్రమే..! అది కూడా కేవలం ఒక్క విద్యార్థి ఈ ఘనతను సాధించారు. మరో 13 మంది 600కుపైగా మార్కులు తెచ్చుకున్నారు. హర్‌దయాళ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గతంలో నీట్‌ పరీక్ష రాసిన ఏడుగురు విద్యార్థులు 720 స్కోరు సాధించటం, మరో ఇద్దరికి 718, 719 స్కోర్లు రావడం(నీట్‌ మూల్యాంకనం ప్రకారం ఈ స్కోర్లు సాధ్యం కానేకాదు) పలు అనుమానాలు రేకెత్తించిన విషయం తెలిసిందే.

పలు రాష్ట్రాల్లో పేపర్‌లీక్‌ అయిందని వార్తలు రావటం, కొందరు విద్యార్థులకు వివాదాస్పద రీతిలో అదనపు మార్కులు కలపటం వంటి చర్యల నేపథ్యంలో.. నీట్‌ అంశం మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 1,563 విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.

ఈ మేరకు గత నెల 24న నిర్వహించిన నీట్‌ రీటె్‌స్టలో 1,563 మందికిగాను దాదాపు 800 మంది మాత్రమే హాజరయ్యారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణ సోమవారం జరగనుంది. కాగా.. మే 5న నీట్‌ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.


ఇకపై రెండంచెలుగా నీట్‌?

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పలు వివాదాలకు కేంద్రంగా మారుతుండటంతో.. ఆ పరీక్ష నిర్వహణలో కీలకమార్పులు చేపట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక మీదట ప్రిలిమ్స్‌, ఫైనల్స్‌ పద్ధతిలో రెండంచెలుగా ఈ పరీక్షను నిర్వహించటం, రెండింటినీ ఒకే సంస్థకు అప్పగించకుండా..

వేర్వేరు సంస్థలకు బాధ్యతలు ఇవ్వటం వంటి ఆలోచనలు జరగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై కేంద్రానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ, ‘‘సీట్ల సంఖ్య, ప్రిలిమినరీ స్కోరు ఆధారంగా కటా్‌ఫను నిర్ణయించటం, సీట్ల సంఖ్యకు నాలుగైదు రెట్ల సంఖ్యలో ఫైనల్‌కు అభ్యర్థులను ఎంపిక చేయటం వంటి అంశాలపై కసరత్తు జరగుతోంది. ప్రిలిమ్స్‌ను రాతపరీక్షలాగే నిర్వహించినా, ఫైనల్స్‌ను కంప్యూటర్‌ ఆధారితంగా (సీబీటీ) జరపటం వంటి ప్రత్యామ్నాయాలూ చర్చకు వస్తున్నాయి. ప్రిలిమ్స్‌ను ఎన్టీఏకు అప్పగిస్తే ఫైనల్స్‌ను సీబీఎ్‌సఈ, ఎయిమ్స్‌ వంటి ఇతర సంస్థలకు అప్పగించటాన్నీ పరిశీలిస్తున్నారు’’ అని వెల్లడించారు. దీనివల్ల అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 04:40 AM