Delhi : ప్రాణాల మీదకు తెస్తున్న విదేశీ విద్య
ABN , Publish Date - Jul 28 , 2024 | 04:01 AM
విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులు దురదృష్టకర పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు. గత ఐదేళ్లలో 633 మంది విద్యార్థులు ఇలా 41 దేశాల్లో మరణించారు.
ఐదేళ్లలో 633 మంది భారత విద్యార్థుల మృతి
న్యూఢిల్లీ, జూలై 27: విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులు దురదృష్టకర పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు. గత ఐదేళ్లలో 633 మంది విద్యార్థులు ఇలా 41 దేశాల్లో మరణించారు. ఈమేరకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ కేరళ ఎంపీ కొడికునిల్ సురేశ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో సమాచారం ఇచ్చారు.
విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అత్యధికంగా కెనడాలో 172 మంది చనిపోయారు. తరువాతి స్థానంలో 108 మందితో యూఎ్‌స(అమెరికా) ఉంది. యూకేలో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24 మంది మృత్యువాత పడ్డారు. పాకిస్థాన్‌లో కూడా ఒక భారత విద్యార్థి మరణించారు.
ఇలా విద్యార్థుల మరణాలకు కారణాలు పరిశీలిస్తే... సహజ మరణాలు, ప్రమాదాలు, దాడులు కారణాలుగా ఉన్నాయి. 19 మంది విద్యార్థులు హింసాత్మక దాడుల్లో మరణించగా వారిలో అత్యధికంగా కెనడాలో 9 మంది, యూఎ్‌సలో ఆరుగురు, ఆస్ట్రేలియా, యూకే, చైనా, కిర్గిజిస్థాన్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 2024 లెక్కల ప్రకారం..13.3 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు.