Delhi : మళ్లీ వార్తల్లోకి ‘మొదానీ’!
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:54 AM
అదానీ గ్రూప్‌కు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కట్టబెట్టడంపై కెన్యాలో రాజకీయ వివాదం చెలరేగింది. రాజకీయ నాయకులు పెద్దఎత్తున లంచాలు తీసుకొని అదానీ కంపెనీకి ప్రాజెక్టులు అప్పగించారని కెన్యా నేతలు ఆరోపిస్తున్నారు.
ఈసారి కెన్యా నుంచి.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ, అక్టోబరు 14: అదానీ గ్రూప్‌కు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కట్టబెట్టడంపై కెన్యాలో రాజకీయ వివాదం చెలరేగింది. రాజకీయ నాయకులు పెద్దఎత్తున లంచాలు తీసుకొని అదానీ కంపెనీకి ప్రాజెక్టులు అప్పగించారని కెన్యా నేతలు ఆరోపిస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, విద్యుత్తు లైను, తదితర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అదానీకంపెనీకి అప్పగించడంపై కెన్యాలో కొద్ది నెలలుగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా ప్రధాని మోదీ, అదానీ గురించి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మోదీపై విరుచుకుపడింది.
‘‘నేను కెన్యా ప్రధానిగా ఉన్న సమయంలో అదానీ కంపెనీని అప్పటి గుజరాత్ సీఎం అయిన మోదీ నాకు పరిచయం చేశారు’’ అని ఒడింగా చెప్పినట్లుగా ఉన్న వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తనకు సన్నిహితులైన వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చడంలో మోదీ దిట్ట అని ఆరోపించారు. ‘‘అదానీతో, అదానీ కోసం, అదానీ చేత.. గడిచిన పదేళ్లలో భారతదేశ విదేశాంగ విధానం కథ ఇది’’ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘‘మొదానీ (మోదీ-అదానీ) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి కెన్యా నుంచి’’ అని ఎద్దేవా చేశారు. ఇక కెన్యాలోని ప్రధాన విమానాశ్రయ నిర్వహణ బాధ్యతను అదానీకి అప్పగించడంపై తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయాన్ని కోర్టు కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా, అదానీ గ్రూపు గత వారమే హై ఓల్టేజ్ విద్యుత్తు సరఫరా లైన్లు నిర్మించే ఒప్పందంపై సంతకాలు చేసింది. మరోవైపు రాజకీయ నాయకులకు భారీగా ముడుపులిచ్చి, ప్రాజెక్టులను దక్కించుకున్నారంటూ గౌతమ్ అదానీపై కెన్యా సెనెటర్ డేనియల్ కిటోంగా మాంజో ఆరోపణలు చేశారు.