Delhi : బెంగళూరు, ఠాణె, పుణెల్లో మెట్రో విస్తరణ
ABN , Publish Date - Aug 17 , 2024 | 02:47 AM
కేంద్ర మంత్రివర్గం శుక్రవారం అయిదు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బెంగళూరులో మెట్రో రైలు విస్తరణ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని పుణె, ఠాణేల్లో మెట్రో రైళ్ల ఏర్పాటు ఇందులో ప్రధానమైనవి.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర మంత్రివర్గం శుక్రవారం అయిదు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బెంగళూరులో మెట్రో రైలు విస్తరణ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని పుణె, ఠాణేల్లో మెట్రో రైళ్ల ఏర్పాటు ఇందులో ప్రధానమైనవి. బిహార్, ఉత్తర పశ్చిమ బెంగాల్‌లో విమానయాన సౌకర్యాలను పెంచేందుకు కూడా ఆమోదముద్ర వేసింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మహారాష్ట్రలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. జూన్‌లో అధికారం చేపట్టిన తరువాత రూ.2లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని వివరించారు.
అంతకుముందు మహారాష్ట్రలోని వధవాన్‌లో రూ.76,200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆల్ వెదర్ మేజర్ పోర్టు నిర్మాణానికి అంగీకారం తెలిపింది. వారణాసిలో రూ.2,869 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం, రూ.24,657 కోట్లతో ఎనిమిది కొత్త రైల్వే లైన్లు, రూ.50,655 కోట్లతో 8 జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్ల నిర్మాణానికి కూడా ఆమోదముద్ర వేసింది.