ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విజయ్ నాయర్‌కు బెయిల్
ABN , Publish Date - Sep 03 , 2024 | 02:21 AM
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆప్ నేత విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరైంది. సుమారు 23 నెలల పాటు జైలులో ఉన్న నాయర్.. పీఎల్‌ఎంఏ కేసులో బెయిల్ కోసం గత నెల 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆప్ నేత విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరైంది. సుమారు 23 నెలల పాటు జైలులో ఉన్న నాయర్.. పీఎల్‌ఎంఏ కేసులో బెయిల్ కోసం గత నెల 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భాటిల ధర్మాసనం విచారణ జరిపింది. సోమవారం తుది తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం బెయిల్ నిబంధనలపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించింది. ఈ కేసులో గత నెల 9న సిసోడియాకు, 27న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే..! నాయర్ కూడా 23 నెలల పాటు(2022 నవంబరు 13 నుంచి) జైలులో ఉన్న నేపథ్యంలో రాజ్యాంగంలోని 21వ అధికరణ(జీవించే హక్కు)ను అనుసరించి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది.