Share News

Lok sabha: కేంద్ర మంత్రిని అనర్హుడంటూ విమర్శించిన డీఎంకే ఎంపీ.. అట్టుడికిన సభ

ABN , Publish Date - Feb 06 , 2024 | 02:36 PM

కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ మంత్రిగా ఉండటానికి తగరని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో మంగళవారంనాడు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఎంపీ వ్యాఖ్యలు దళిత వర్గాన్ని అవమానించేలా ఉన్నాయంటూ అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టంపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా ఈ గందరగోళం చెలరేగింది.

Lok sabha: కేంద్ర మంత్రిని అనర్హుడంటూ విమర్శించిన డీఎంకే ఎంపీ.. అట్టుడికిన సభ

న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ (L Murugan) మంత్రిగా ఉండటానికి తగరని డీఎంకే (DMK) ఎంపీ టీఆర్ బాలు (TR Baalu) చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో మంగళవారంనాడు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఎంపీ వ్యాఖ్యలు దళిత వర్గాన్ని అవమానించేలా ఉన్నాయంటూ అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టంపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా ఈ గందరగోళం చెలరేగింది.


డీఎంకే ఎంపీలు ఎ.రాజా, ఎ.గణేశన్ ఈ అంశంపై మాట్లాడుతూ, డిసెంబర్‌లో భారీ వర్షాలు, వరదరతో చెన్నై, పరిసర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయని, నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపించారా అని ప్రశ్నించారు. అదే జరిగితే సహాయ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్ని నిధులు పంపారు? ఏవిధంగా ఆదుకున్నారో ఆ వివరాలను హోం వ్యవహారాల శాఖ మంత్రి తెలియజేయాలని కోరారు. ఇదే అంశంపై శ్రీపెరంబుదూరు ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతుండగా, తమిళనాడుకే చెందిన బీజేపీ ఎంపీ ఎల్.మురుగన్ జోక్యం చేసుకున్నారు. దీంతో బాలు అసహనం వ్యక్తం చేస్తూ, జోక్యం చేసుకోవడానికి మీరెవరు? దయచేసి కూర్చోండి. మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉండడానికి అనర్హులు, మంత్రిగా కూడా అనర్హులే..అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్వాల్ అభ్యంతరం తెలిపారు. డీఎంకీ ఎంపీ తన సహచరుడిని అసమర్ధుడని అనడం సరికాదని అన్నారు. ఒక ఎస్‌సీ మంత్రిని అసమర్ధుడని ఎలా అంటారు? ఇది దళితులను అవమానించడమేననని జోషి అభ్యంతరం చెప్పారు.


క్షమాపణ చెప్పాలి..

''టీఆర్ బాలు ప్రశ్న వేశారు. మా కేంద్ర మండలికి చెందిన దళిత మంత్రి తమ స్థానం నుంచి లేచి అసంబద్ధమైన ప్రశ్న అడిగారని చెప్పారు. దానికి మీరు ఆయనను అసమర్ధుడని అన్నారు. ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి, ఎస్‌సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే. ఆయనను అన్‌ఫిట్ అనడం దళిత కమ్యూనిటీకే అవమానం. బాలు క్షమాపణ చెప్పాలి'' అని మేఘ్వాల్ డిమాండ్ చేశారు. అయితే, బాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. మంత్రి రాజకీయాల్లో ఉండడానికి కూడా సరిపోరని వ్యాఖ్యానించారు. దీంతో జోషి కలగజేసుకుంటూ డీఎంపీ ఎంపీ మొత్తం ఎస్సీ కమ్యూనిటీనే అవమానిస్తున్నారని తప్పుపట్టారు. కాగా, జనవరి 31వ తేదీన ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనున్నాయి.

Updated Date - Feb 06 , 2024 | 02:36 PM