National : మోదీ.. 758 సార్లు!
ABN , Publish Date - May 31 , 2024 | 04:42 AM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ 421 సార్లకు పైగా ‘మందిరం-మసీదు’, దేశాన్ని విడదీసే విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
ప్రచారంలో ప్రధాని ఆయన పేరునే జపించారు: ఖర్గే
న్యూఢిల్లీ, మే 30 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ 421 సార్లకు పైగా ‘మందిరం-మసీదు’, దేశాన్ని విడదీసే విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కులం, మతం పేరిట ఓట్లు అడగకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలున్నప్పటికీ.. వాటిని ఉల్లంఘించారని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గత 15 రోజుల్లో మోదీ తన ప్రసంగాల్లో ఆయన పేరును 758 సార్లు, కాంగ్రెస్ పేరును 232 సార్లు, 573 సార్లు ఇండియా కూటమి, ప్రతిపక్షాల పార్టీల గురించి ప్రస్తావించారు. అంతేకానీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి ఒక్కసారీ మాట్లాడలేదు’ అని విమర్శించారు. కన్యాకుమారిలో ధాన్యం చేసేందుకు మోదీ వెళ్లడంపైనా ఖర్గే ఘాటుగా స్పందించారు. ధాన్యం చేస్తేనో.. గంగలో స్నానం చేస్తేనో.. జ్ఞానం రాదని సెటైర్ వేశారు.