Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. చైనాలో భూకంప కేంద్రం
ABN , Publish Date - Jan 23 , 2024 | 07:47 AM
సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్‌యాంగ్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.
సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్‌యాంగ్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది. మొదట తెల్లవారుజామున 2 గంటల 9 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఆ తర్వాత 2 గంటల వ్యవధిలోనే 14 సార్లు భూమి కంపించింది. అయితే ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పక్క దేశంలో భూకంపం సంభవించినప్పుడు దాని తీవ్రత ఢిల్లీని తాకడం ఇది కొత్తేం కాదు. ఈ ఏడాది జనవరి 11న అప్ఘానిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భకంపం సంభవించింది. అప్పుడు కూడా భూప్రకంపనలు ఢిల్లీని తాకాయి. నేపాల్‌లో భూకంపం సంభవించినప్పుడు కూడా దాని తీవ్రత ఢిల్లీపై పడుతుంటుంది.
ఇక ప్రస్తుతం చైనాలో సంభవించిన భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్- జిన్‌జియాంగ్ సరిహద్దులో ఉన్న అనేక మంది గాయపడ్డారని, కొన్ని ఇళ్లు కూడా కూలిపోయాయని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిన్‌జియాంగ్ రైల్వే శాఖ పరిధిలోని 27 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భూప్రకంపనలు సంభవించిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక కజకిస్థాన్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కజకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన అల్మాటీలో భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వారంతా భయంతో బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత ఉబ్బెకిస్తాన్‌లో కూడా భూకంపం సంభవించింది. అయితే కజకిస్థాన్, ఉబ్బెకిస్థాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి గాయాలు లేదా ఆస్తి నష్టం వంటివి వెలుగులోకి రాలేదు.