Share News

Delhi Excise policy case: పట్టువీడని ఈడీ... సీఎంకు ఎనిమిదో సారి సమన్లు

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:03 PM

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారంనాడు మరోసారి సమన్లు పంపింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని కోరింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ఇది వరుసగా ఎనిమిదో సారి.

Delhi Excise policy case: పట్టువీడని ఈడీ... సీఎంకు ఎనిమిదో సారి సమన్లు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi Excise policy case)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మంగళవారంనాడు మరోసారి సమన్లు పంపింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని కోరింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ఇది వరుసగా ఎనిమిదో సారి. ఇంతవరకూ ఏడుసార్లు ఈడీ సమన్లు పంపినప్పటికీ కేజ్రీవాల్ హాజరుకాలేదు. అయితే ప్రతిసారి లిఖిత పూర్వకంగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు. సోమవారంనాడు ఏడోసారి సమన్లకు గైర్హాజరైన కేజ్రీవాల్... ప్రతిసారి ఈడీ సమన్లు పంపడానికి బదులు, కోర్టు నిర్ణయం కోసం వేచిచూడాలని అన్నారు. మార్చి16న ఈ కేసు విచారణకు రానుంది.


కేజ్రీవాల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 26, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 2, జనవరి 18, జనవరి 3, గత ఏడాది డిసెంబర్ 21, నవంబర్ 2న సమన్లు పంపింది. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమంటూ కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు.


కేసు ఏమిటి?

2021-22 ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, ముడుపులు తీసుకుని లిక్కర్ ట్రేడర్లకు ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేసిందని ఈడీ ఆరోపణగా ఉంది. అయితే ఈ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది. 2022 జూలైలో గవర్నర్ ఎల్జీ వీకే సక్సేనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో ఎక్సైజ్ విధానాన్ని రద్దు చేశారు. అనంతరం మనీలాండరింగ్ కింద సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి.

Updated Date - Feb 27 , 2024 | 03:03 PM