Share News

National: యూపీలో అందుకే ఓడిపోయాం.. పార్టీ అంతర్గత సమీక్షలో మనసు విప్పిన క్యాడర్..!

ABN , Publish Date - Jul 07 , 2024 | 11:31 AM

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.

National: యూపీలో అందుకే ఓడిపోయాం.. పార్టీ అంతర్గత సమీక్షలో మనసు విప్పిన క్యాడర్..!
Modi and Yogi

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఒంటరిగా మెజార్టీ మార్క్ చేరుకోకపోయినా.. భాగస్వామ్యపక్షాలతో ఎన్డీయే అధికారం చేపట్టింది. బీజేపీ టార్గెట్ రీచ్ కాకపోవడానికి.. ఒంటరిగా మెజార్టీ మార్క్ దాటకపోవడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్‌. ఆ రాష్ట్రంలో భారీగా సీట్లు తగ్గడంతో బీజేపీ ఓటమికి కారణాలను సమీక్షించుకునే పనిలో పడింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పార్టీ అంతర్గత సమీక్ష సమావేశంలో బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి బిఎల్.సంతోష్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో జిల్లాస్థాయి నాయకులతో జరిగిన సమీక్షలో అనేక విషయాలను పార్టీ శ్రేణులు వెల్లడించారు. పార్టీ తక్కువ సీట్లు గెలవడానికి ముఖ్యంగా ఎంపీల అహంకారమే కారణమని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఎవరైనా కార్యకర్తలు లేదా స్థానిక ప్రజలు ఎంపీ వద్దకు వెళ్తే కూర్చోమని కూడా అడిగేవారు కాదని.. మీరు మోదీకి ఓటు వేశారు.. మాకు కాదని సమాధానం చెప్పేవారని కొందరు పార్టీ నాయకులు తెలిపారు. ఓ ఎంపీ అయితే తాను ఫోన్ చేస్తే ఆన్సర్‌ చేసేవారు కాదని ఓ జిల్లాస్థాయి నాయకుడు తెలిపారు. ఒక గ్రామంలో సమస్యపై నిరసన తెలిపితే మీ ఓట్లు మాకు అవసరం లేదంటూ ఓ ఎంపీ సమాధానమిచ్చారని.. గత ఎన్నికల్లో 2.5లక్షల మెజార్టీతో గెలిచాం.. ఈసారి 2లక్షల మెజార్టీతో గెలుస్తామని చులకనగా మాట్లాడేవారన్నారు. అలా అహంకారపూరితంగా వ్యవహరించిన నాయకులను ఈసారి ప్రజలు ఓడించారని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ వైఫల్యం చెందిందనే విషయంపై బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ముందు ఆ పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ ఓటమికి గల అనేక కారణాలను వివరించారు.

Puri Jagannath Rath Yatra: కాసేపట్లో పూరీ జగన్నాథ రథయాత్ర .. పోటెత్తిన లక్షలాది జనం


తొలిసారి..

ఓటమిపై సమీక్షించేందుకు ఎన్నికల తర్వాత తొలిసారిగా బీజేపీ జిల్లాస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించింది. కేంద్ర నాయకత్వం ముందు ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు యూపీ నేతలు మాత్రమే ఓటమిపై ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అంతర్గత విషయాలను కేంద్రనాయకత్వానికి తెలిపారు. ఎంపీలు పార్టీ కార్యకర్తలను ధిక్కరించడంతోనే ఓటమి చెందినట్లు ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

Bengaluru : ప్రయాణికులంతా ఎక్కారు.. పైలెట్లు లేరు


అవమానించేవారు..

ఎంపీలు జిల్లాస్థాయి నాయకులను పట్టించుకునేవారు కాదని, ఉద్దేశపూర్వకంగా అవమానించేవారని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాస్థాయి నాయకుల పేర్లను ప్రస్తావించడానికి ఇష్టపడని ఎంపీలు కూడా ఉన్నారని ఓ జిల్లా అధ్యక్షుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంపీ దగ్గరకు కార్మిక సంఘాల నాయకులు వెళ్తే అవమానించేవారన్నారు. ఏదైనా కార్యక్రమం ప్లాన్ చేస్తే సమయానికి ఎంపీ వచ్చేవారు కాదని మరికొందరు తమ అభిప్రాయాలను తెలిపారు.


కనిపించని ఉత్సాహం

ఈ ఎన్నికల్లో కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించలేదని సమీక్షా సమావేశంలో చాలామంది వాపోయారు. యూపీ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పెద్దగా పట్టించుకోవడంలేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పాతుకుపోయిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలా నాయకులు ప్రవర్తించలేదని కొందరు కార్యకర్తలు వాపోయారు. క్షేత్రస్థాయిలో ఇంకా అవినీతి జరుగుతోందని.. దీనిని నివారించలేకపోవడం ఓటమికి కారణంగా మరికొందరు తెలిపారు. కార్యకర్తలు చెప్పిన ప్రతిఅంశాన్ని విన్న బీఎల్ సంతోష్.. ఎక్కడ కార్యకర్తల అభిప్రాయాలను అడ్డుకునే ప్రయత్నం కానీ.. మధ్యలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయలేదు. చివరిలో మాత్రం ఇకనుంచి అన్ని ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.


Official Sources : కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 07 , 2024 | 11:31 AM