Sharad Pawar: సీనియర్ పవార్ విందు ఆహ్వానాన్ని తోసిపుచ్చిన సీఎం... కారణం ఏమిటంటే..?
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:12 PM
మహారాష్ట్ర దిగ్గజ నేత, ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ విందు ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారంనాడు తోసిపుచ్చారు. ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నానంటూ సీఎం తెలియజేశారు.
ముంబై: మహారాష్ట్ర దిగ్గజ నేత, ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) విందు ఆహ్వానాన్ని (Dinner invitation) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) శుక్రవారంనాడు తోసిపుచ్చారు. ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నానంటూ సీఎం తెలియజేశారు. మార్చి 2న పుణె జిల్లా బారామతిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్ వస్తుండటంతో ఆ ముగ్గురిని బారామతిలోని తన నివాసంలో విందుకు శరద్ పవార్ ఆహ్వానించారు. శరద్ పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేపై బారామతిలో అజిత్ పవార్ తన భార్యను నిలబెట్టనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో శరద్ పవార్ విందు ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది.
శరద్ పవార్ లేఖ..
దీనికి ముందు, ముఖ్యమంత్రిని విందుకు ఆహ్వానిస్తూ శరద్ పవార్ లేఖ రాశారు. ''ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం తొలిసారి బారామతి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే మహా రోజ్‌గార్ ఈవెంట్‌లో సీఎం హాజరుకానుండటం సంతోషంగా ఉంది. ఈవెంట్ పూర్తికాగానే ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి మా ఇంటికి విందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను'' అని శరద్ పవార్ ఆ లేఖలో పేర్కొన్నారు.