Maharashtra: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో హింట్ ఇచ్చిన సీఎం
ABN , Publish Date - Sep 15 , 2024 | 06:30 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సూచనప్రాయంగా తెలిపారు. రెండు విడతలుగా ఎన్నికలు ఉండవచ్చని అన్నారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సూచనప్రాయంగా తెలిపారు. నవంబర్ రెండో వారంలో ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. రెండు విడతలుగా ఎన్నికలు ఉండవచ్చని అన్నారు. మహాయుతి కూటమి మధ్య సీట్ల షేరింగ్ అనేది ప్రతిభ, గుడ్ స్ట్రైక్ రేట్ ఆధారంగానే ఉంటుందని తెలిపారు. ముంబైలోని అధికార 'వర్ష' నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాబోయే 8-10 రోజుల్లో బీజేపీ, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారవుతాయని చెప్పారు.
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ 150 నుంచి 160 సీట్లలో పోటీ చేయనుంది. అదే జరిగితే ఎన్‌సీపీ, శివసేనకు 128-138 సీట్లు దక్కుతాయి. కాగా, తమ ప్రభుత్వానికి మహళల మద్దతు పుష్కలంగా ఉందని షిండే తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మధ్య సమతుల్యతను తమ ప్రభుత్వం పాటిస్తున్నట్టు చెప్పారు. స్కిల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద 1.5 లక్షల మంది యువకుల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, వీరికి రూ.6,000 నుంచి రూ.10,000 స్టయిఫండ్ వస్తుందని చెప్పారు.
Haryana Assembly Elections 2024: నేను సీనియర్‌ని, సీఎం పదవి అడుగుతా..
లోక్‌సభ ఎన్నికల్లో చేదు ఫలితం..
ఇటీవల జరిగిన మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమికి గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ సీట్ల సంఖ్య 9కి పడిపోయింది. షిండే శివసేన 7 సీట్లు గెలుచుకోగా, అజిత్ పవార్ ఎన్‌సీపీ కేవలం ఒకే సీటుకు పరిమితమైంది. మరోవైపు, విపక్ష 'మహా వికాస్ అఘాడి' 30 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 13, ఎన్సీపీ (ఎస్‌పీ) 8, శివసేన (యూబీటీ) 9 స్థానాలు గెలుచుకున్నాయి.