Share News

Population Issue: నిన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్.. నేడు ఎలన్‌ మస్క్.. జనాభా తగ్గుదలపై వార్నింగ్..

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:47 PM

సంతానోత్పత్తి రేటు ఏ దేశంలోనైనా 2.1 శాతానికి మించి ఉండాలని ఎలన్ మస్క్ తెలిపారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్‌లో ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని సూచించారు. ఈ అంశం దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఓవైసీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు..

Population Issue: నిన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్.. నేడు ఎలన్‌ మస్క్.. జనాభా తగ్గుదలపై వార్నింగ్..
Elon Musk and Mohan Bhagwat

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో సంతానోత్పత్తి తగ్గుదలపై తాజాగా పారిశ్రామికవేత్త, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. సంతానోత్పత్తి పెరగకపోతే రానున్న రోజుల్లో సింగపూర్ వంటి కొన్ని దేశాలు అంతరించిపోతాయని ప్రకటించారు. సంతానోత్పత్తి రేటు ఏ దేశంలోనైనా 2.1 శాతానికి మించి ఉండాలని ఎలన్ మస్క్ తెలిపారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్‌లో ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని సూచించారు. ఈ అంశం దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఓవైసీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇండియా కూటమి నేతలు మోహన్ భగవత్ వ్యాఖ్యలను ఖండించారు. ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ అడుగు ముందుకేసి సంతానోత్పత్తి పెరిగితే వారి పోషణకు డబ్బులు ఎవరిస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎలన్ మస్క్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోహన్ భగవత్ ఓ మతానికి, కులానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయనప్పటికీ ఓ మతానికి చెందిన నాయకులు తీవ్రంగా స్పందించడంతో మోహన్ భగవత్ కామెంట్స్ మత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనిపై కొద్దిరోజులు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా ప్రపంచ దేశాల్లో పరిస్థితిని పేర్కొంటూ ఎలన్ మస్క్ సంతానోత్పత్తిపై చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.


మోహన్ భగవత్ ఏమన్నారంటే..

డిసెంబర్1వ తేదీన నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారతదేశ జనాభా వృద్ధి రేటు (Fertility Rate) తగ్గుతుండటం, తద్వారా సామాజిక మనుగడ విషయంలో తలెత్తే చిక్కులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఛీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఆందోళన వ్యక్తం చేశారు. సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని ఆధునిక జనాభా శాస్త్రం తేల్చిచెబుతోందని అన్నారు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. సమాజంలో సంతానోత్పత్తి రేటు 2.1 శాంత కంటే తక్కువగా ఉంటే ఆ సమాజం ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండానే అదృశ్యమవుతుందని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందని మోహన్ భగవత్ అన్నారు. జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు.


ఎలన్ మస్క్ ఏమన్నారంటే..

ఎలన్‌మస్క్ వ్యాఖ్యలు, మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయి. సంతానోత్పత్తి తగ్గితే ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండా భారత్ అదృశ్యమవుతుందని చెప్పగా.. ఎలన్ మస్క్ సింగపూర్‌ను ఉదాహరణగా చెప్పారు. నానాటికీ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా సింగపూర్‌తో పాటు పలు దేశాలు అంతరించిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుదలపై నెట్టింట మరోసారి పెద్ద చర్చ మొదలైంది. నానాటికీ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటుతో సింగపూర్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గతేడాది ఈ రేటు 0.97కి పడిపోయింది. ఒకటికి దిగువకు ఈ రేటు చేరడం ఇదే తొలిసారి. అక్కడి మహిళలు సగటున ఒక్క సంతానానికీ జన్మనివ్వట్లేదని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. జనభా సుస్థిరతకు కావాల్సిన 2.1 రేటుకంటే ఇది చాలా తక్కువ కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో సింగపూర్ వంటి దేశాలు అంతరించిపోతాయంటూ ఎలన్ మస్క్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 06 , 2024 | 03:05 PM