Elon Musk's : మన ఈవీఎంలు వేరే లెవల్!
ABN , Publish Date - Jun 20 , 2024 | 04:10 AM
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వాటి విశ్వసనీయతపై ఆందోళన మొదలైంది.
వాటిని మరో పరికరంతో అనుసంధానించడం కుదరదు
ఈవీఎంల రూపకల్పనలో సహకరించిన ఐఐటీ ప్రొఫెసర్ల వివరణ
న్యూఢిల్లీ, జూన్ 19: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వాటి విశ్వసనీయతపై ఆందోళన మొదలైంది. ఈవీఎంల పారదర్శకతను నిర్ధారించాలని, లేకపోతే వాటిని పూర్తిగా రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీతోపాటు విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అయితే భారతీయ ఈవీఎంలు పూర్తి సురక్షితమైనవని, అవి ట్యాంపరింగ్ ప్రూఫ్ అని పలువురు భారతీయ ఇంజనీర్లు, డొమైన్ నిపుణులు పేర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించిన ఎం3 (మోడల్ 3) ఈవీఎంలో బహుళ భద్రతా ఫీచర్లు ఉన్నాయని వీటిని రూపొందించడంలో సహకరించిన ఐఐటీ ప్రొఫె సర్లు చెబుతున్నారు. ఈవీఎం ఒక సాధారణ కాలిక్యులేటర్ వంటిదని, దాన్ని హ్యాక్ చేయలేమని ఐఐటీ గాంధీనగర్ డైరెక్టర్, ఈవీఎం టెక్నికల్ ప్యానెల్లో సభ్యుడు రజత్ మూనా తెలిపారు.
2019లో ప్రవేశపెట్టిన ఎం3 మోడల్‌ను ట్యాంపరింగ్ చేస్తే అందులోని ఆటోమేటెడ్ ఫంక్షన్లు, సాంకేతికలు వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేసేస్తాయన్నారు. వీటిని ఇంటర్నెట్కు, మరే ఇతర పరికరాలకు అనుసంధానం చేయ డం సాధ్యంకాదని చెప్పారు. ‘ప్రపంచంలోని ఇతర ఈవీఎంలకంటే భారత ఈవీఎంలు భిన్నం. ఎం3 ఈవీఎంలకు ఇతర పరికరాలతో ఎలాంటి కనెక్షన్ ఉండదు. వీటిని కేవలం ఓటింగ్ కోసమే రూపొందించారు. వాటిలో మరే ఇతర సాఫ్ట్‌వేర్‌గానీ, ప్రోగ్రామ్లుగానీ లోడ్ చేయలేం’ అని ఐఐటీ బాంబేలో గౌరవాచార్యుడు, మైక్రో ఎలకా్ట్రనిక్స్ నిపుణుడు దినేశ్‌శర్మ పేర్కొన్నారు.