Lok Sabha Elections: శత్రువు 100 సార్లు ఆలోచించాల్సిందే.. దాయాదికి మోదీ ఝలక్
ABN , Publish Date - May 18 , 2024 | 05:50 PM
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని అన్నారు.
అంబాలా: కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నొక్కిచెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని అన్నారు. హర్యానాలోని అంబాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శనివారంనాడు ప్రసంగించారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగనుంది.
''దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే, శత్రువులు మనపై ఏది చేయడానికైనా ముందు 100 సార్లు ఆలోచిస్తారు. పాకిస్థాన్ 70 ఏళ్ల నుంచి భారతదేశానికి ఇక్కట్లపాలు చేస్తోంది. వాళ్లకు చేతిలో బాంబులు ఉన్నాయి. ఇవాళ వాళ్ల చేతుల్లో భిక్షాపాత్ర ఉంది. బలమైన ప్రభుత్వం అనేది ఉంటే శత్రువులు వణుకుతారు'' అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ను ప్రస్తావిస్తూ, అక్కడి పరిస్థితిని బలహీన ప్రభుత్వం ఉంటే మార్చగలదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే హర్యానాలోని వీరమాతలు రేయింబవళ్లు ఆందోళనతో ఉండేవారనీ, ఈరోజు పదేళ్లుగా అవన్నీ ఆగిపోయాయని చెప్పారు. బలమైన మోదీ ప్రభుత్వం 370వ అధికరణ అనే గోడను కూల్చేసిందని, కశ్మీర్ అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు.
Lok Sabha Elections: మోదీ 'రామమందిరం-బుల్డోజర్' వ్యాఖ్యలపై కస్సుమన్న ఖర్గే.. ఈసీ చర్యలకు డిమాండ్
మరో 17 రోజులే ఉన్నాయి..
జూన్ 4వ తేదీకి (ఫలితాలు వెలువడడానికి) మరో 17 రోజులే ఉన్నాయని, నాలుగు విడతల పోలింగ్‌లో ఇండియా కూటమి ఎత్తులను ప్రజలు చిత్తుచేశారని అన్నారు. దేశభక్తి నరనరాల్లో ఉన్న రాష్ట్రం హర్యానా అని, దేశవ్యతిరేక శక్తులు ఏవో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ప్రజల కలలు పండించడమే తన రిజల్యూషన్ అని, అదే తన గ్యారెంటీ అని మోదీ హామీ ఇచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా రేయింబవళ్లు పనిచేస్తానని, వికసిత్ భారత్‌కు పేదలు, యువకులు, మహిళలు, రైతులు నాలుగు మూలస్తంభాలని చెప్పారు. నా దేశం, నా హిందుస్థాన్ బలపడాలనే ఆలోచనతో ఈ నాలుగు స్తంభాలను పటిష్టం చేస్తానని అన్నారు.
Read Latest National News and Telugu News