Excise case: కేజ్రీవాల్ గైర్హాజరుపై కోర్టుకు ఈడీ ఫిర్యాదు
ABN , Publish Date - Feb 03 , 2024 | 09:03 PM
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పదేపదే విచారణకు గైర్హాజర్ అవుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై రౌస్ అవెన్యూ కోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆశ్రయించింది. పీఎంఎల్-2002 సెక్షన్ 50 కింద సీఎంపై కోర్టులో ఫిర్యాదు చేసింది. తాము పంపిన సమన్లను ఖాతరు చేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi liqor policy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పదేపదే విచారణకు గైర్హాజర్ అవుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై రౌస్ అవెన్యూ కోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆశ్రయించింది. పీఎంఎల్-2002 సెక్షన్ 50 కింద సీఎంపై కోర్టులో ఫిర్యాదు చేసింది. తాము పంపిన సమన్లను ఖాతరు చేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. శనివారంనాడు ఈడీ తరఫు వాదనలు విన్న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్వ మల్హోత్రా తక్కిన ఫిర్యాదులను ఫిబ్రవరి 7వ తేదీని పరిశీలించాలని నిర్ణయించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22కు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ ఐదుసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. తమముందు విచారణకు హాజరుకావాలని కోరింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాల్సిన సీఎం ఈసారి కూడా విచారణకు గైర్హారజరయ్యారు. దీనికి ముందు జనవరి 18న కూడా ఈడీ సమన్లు పంపింది. ఈడీ పంపిన సమన్లు 'చట్టవిరుద్ధమని' ఆప్ చెబుతోంది. దీనికి ముందు నవంబర్ 2, డిసెంబర్ 22వ తేదీల్లో ఈడీ విచారణకు సైతం కేజ్రీవాల్ హాజరుకాలేదు. లిక్కర్ పాలసీ విధానానికి సంబంధించిన అంశంపై కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని ఈడీ భావిస్తోంది. ఇదే కేసులో ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ పలు రౌండ్లు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేయగా, ఆప్ రాజ్యసభ సభ్యుడైన సంజయ్ సింగ్‌ను గత అక్టోబర్ 5న ఈడీ అరెస్టు చేసింది.