Chalo Delhi: నేటి నుంచి రైతుల ‘చలో ఢిల్లీ’ మళ్లీ ప్రారంభం
ABN , Publish Date - Feb 21 , 2024 | 09:05 AM
నేటి నుంచి రైతుల ‘చలో ఢిల్లీ’ మళ్లీ ప్రారంభమైంది. కేంద్రంతో 4వ విడత చర్చలు విఫలం కావడంతో తాజాగా నిర్ణయం తీసుకుంది. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు బోర్డర్ నుంచి రైతులు ఢిల్లీ వైపు బయల్దేరనున్నారు. ఆదివారం అర్థరాత్రి రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల బృందం చర్చలు నిర్వహిస్తోంది.
ఢిల్లీ: నేటి నుంచి రైతుల ‘చలో ఢిల్లీ (Chalo Delhi)’ మళ్లీ ప్రారంభమైంది. కేంద్రంతో 4వ విడత చర్చలు విఫలం కావడంతో తాజాగా నిర్ణయం తీసుకుంది. పంజాబ్-హర్యానా (Punjab-Haryana) సరిహద్దు శంభు బోర్డర్ నుంచి రైతులు ఢిల్లీ వైపు బయల్దేరనున్నారు. ఆదివారం అర్థరాత్రి రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల బృందం చర్చలు నిర్వహిస్తోంది. అర్జున్ ముండా (Arjun Munda), పీయూష్ గోయల్ (Piyush Goel), నిత్యానంద రాయ్ (Nityananda Rai) మంత్రుల బృందంలో ఉన్నారు. ఈ భేటీలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Singh Man) పాల్గొన్నారు.
పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే ఐదేళ్లపాటు కొనేలా ఒప్పందం చేసుకుంటామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, గత రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం డిమాండ్లతో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్లు, ట్రాలీలతో బయల్దేరిన రైతులను పంజాబ్-హర్యానా హైకోర్టు తప్పుబట్టింది. రైతులు శాంతియుతంగా ఆందోళన చేయవచ్చని, కానీ మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తూ హైవేల మీద ట్రాక్టర్లు, ట్రాలీలు తీసుకెళ్లడం సరికాదని మందలించింది. శంభు బోర్డర్ నుంచి ఢిల్లీ దిశగా ట్రాక్టర్లు, ట్రాలీలతోనే రైతులు బయల్దేరుతున్నారు.
భారత్‌లోనే కాదు, యూరప్ దేశాల్లోనూ..
భారత్‌లోనే కాదు, యూరప్ దేశాల్లోనూ రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. స్పెయిన్, ఫ్రాన్స్, పోలాండ్, ఇటలీ, గ్రీస్, బెల్జియం, లిథువేనియా, పోర్చుగల్, రొమేనియా దేశాల రైతులు ఆందోళన బాట పట్టారు. వ్యవసాయ క్షేత్రాల నుంచి వెలువడే నైట్రోజన్ గ్యాస్ ఉద్గారాలపై పరిమితులు విధించడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొస్తున్న గ్రీన్ పాలసీలు తమకు గుదిబండలా మారుతున్నాయని అంటున్నారు. గతంలో 2019లో డచ్ రైతులు రహదారులను దిగ్బంధించారు. 2022లో ఇంధన సబ్సిడీ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ జర్మనీలో 10వేల మంది రైతుల ఆందోళన నిర్వహించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రైతు అనుకూల పాలసీలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ పోలండ్‌లో 2023లో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. తాజాగా ఫ్రాన్సులో ట్రాక్టర్లతో హైవేలపై ప్రదర్శనలు జరిగాయి.