Mahadev Betting App Scam: మాజీ సీఎంపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు
ABN , Publish Date - Mar 17 , 2024 | 08:12 PM
మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఈడీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపైన, మరి కొందరిపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.
రాయపూర్: మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణం (Mahadev Online Betting Scam)లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఈడీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపైన, మరి కొందరిపై ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసింది. మార్చి 4న ఈవోడబ్యూ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ఈవోడబ్ల్యూ వర్గాలు తెలిపాయి. బఘెల్, యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్, శుభం సోని, అనిల్ కుమార్ అగర్వాల్, మరో 14 మంది పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
మహదేవ్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్‌ను రూపొందించేందుకు అప్పట్లో సీఎంగా ఉన్న భూపేష్ బఘెల్ తనను ప్రోత్సహించారని, ఆయనకు రూ.508 కోట్లు చెల్లించామని యాప్ ఓనర్ శుభమ్ సోనీ విచారణ సమయంలో సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బఘెల్ గతంలో తోసిపుచ్చారు.
ఇంత చిన్న రాష్ట్రంపై అన్ని దాడులా?
కాగా, తనపై ఆర్థిక నేరాల విభాగం తాజాగా కేసు నమోదు చేయడాన్ని భూపేష్ బఘెల్ తప్పుపట్టారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2021 నుంచి ఈటీ, ఈడీ, సీబీఐ ఇదే పనిమీద ఉన్నాయని అన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిపి, తన పేరు చేర్చేందుకు ప్రతి ఒక్కరిని బెదిరించాయని, కానీ ఏమీ చేయలేకపోయాయని అన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దర్యాప్తును చేపట్టడంతో ఈడీ జోక్యం చేసుకుందని చెప్పారు. తాను బలహీనంగా ఉండి ఉంటే ఏజెన్సీలన్నీ ముప్పేట దాడి చేసేవని, ఛత్తీస్‌గఢ్ వంటి చిన్న రాష్ట్రంలో గరిష్టంగా దాడులు జరిపారని విమర్శించారు. ఎందుకు వారు భయపడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని పరోక్షంగా కేంద్రం, దర్యాప్తు సంస్థలను తప్పుపట్టారు.