Share News

Central Government: బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్‌ చౌహాన్‌?

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:40 AM

రాజకీయ జీవితం దాదాపు ముగిసిందనుకున్న దశలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (65)కు అత్యంత కీలక బాధ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఆయనకు కబురుపెట్టారు.

Central Government: బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్‌ చౌహాన్‌?

  • నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎంకు పదవి ఢిల్లీకి రావాలంటూ పిలుపు

  • పార్టీలో సీనియర్‌ అయినందునే

  • 6సార్లు ఎంపీగా ఎన్నిక..16ఏళ్లు సీఎం

  • తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం

  • శివరాజ్‌ను నాతో తీసుకెళ్తా.. ప్రచారంలో మోదీ వ్యాఖ్య

  • ఒడిసా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్‌?

  • రేసులో సంబిత్‌ పాత్ర, జ్యుయల్‌ ఓరమ్‌ కూడా

న్యూఢిల్లీ, జూన్‌ 6: రాజకీయ జీవితం దాదాపు ముగిసిందనుకున్న దశలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (65)కు అత్యంత కీలక బాధ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఆయనకు కబురుపెట్టారు. అభిమానులు ముద్దుగా మామ అని పిలుచుకునే శివరాజ్‌ రికార్డు స్థాయిలో పదహారున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అత్యధిక కాలం సీఎంగా ఉన్న బీజేపీ సీఎం కూడా ఈయనే. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌ సారథ్యంలోనే పార్టీ అద్వితీయ విజయం సాధించినప్పటికీ.. సీఎం బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మోహన్‌యాదవ్‌ను సీఎం చేసింది అధిష్ఠానం. ఎమ్మెల్యేగానే మిగిలిపోయిన శివరాజ్‌.. ఓ దశలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘చావనైనా చస్తాను కానీ.. ఢిల్లీకి వెళ్లి పదవి ఇమ్మని కోరను. కొన్నిసార్లు మనం వీరతిలకం కోరుకుంటే.. వనవాసం దక్కుతుంది’’ అంటూ తన నిరసనను వెలిబుచ్చారు. తాజా లోక్‌సభ ఎన్నికల సందర్భంగానూ మొదట శివరాజ్‌ను ఎంపీగా పోటీకి నిలపాలని భావించలేదు. మార్చి2న విడుదల చేసిన చివరి జాబితాలో విదిశ టికెట్‌ ఇచ్చారు. 8.20 లక్షలపైగా భారీ మెజార్టీతో గెలుపొందారు.


  • ఇంతకుమించి సీనియర్లు లేనందునే!

ఎన్నికల ప్రచారం సందర్భంగానే చౌహాన్‌ను ఢిల్లీకి తీసుకెళ్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన అనుభవాన్ని వివరిస్తూ.. దానిని పార్టీ కోసం వినియోగించుకుటామన్న సంకేతం ఇచ్చారు. ఆరుసార్లు ఎంపీ, ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన శివరాజ్‌.. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా, కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఈ స్థాయి అనుభవం ఉన్న నాయకుడు ఎవరూ లేరు. దీంతోనే ఆయనను జాతీయ అధ్యక్షుడిగా నియమించనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కంటే దాదాపు 15 ఏళ్లు ముందే ఎంపీ అయిన చౌహాన్‌కు కేంద్ర మంత్రి పదవి చాలా చిన్నదనే వాదన కూడా వినిపిస్తోంది. జాతీయ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టేందుకే ఆయనను ఢిల్లీకి పిలిచారని చెబుతున్నారు.


  • ఒడిశా సీఎం ఎవరో?

ఒడిశా సీఎంగా కేంద్ర ఉక్కు శాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (55) పేరు బలంగా వినిపిస్తోంది. వాజ్‌పేయీ హయాం లో 2004-09 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేసిన దేవేంద్ర ప్రధాన్‌ కుమారుడు ఈయన. ఏబీవీపీలో చిన్న వయసు నుంచే పనిచేశారు. 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌, బిహార్‌ నుంచి రెండుసార్లు రాజ్యసభకు వెళ్లారు. 2017లో మొదటిసారి కేంద్ర మంత్రి అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, పెట్రోలియం శాఖలను చూశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఒడిశా ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనలో ప్రధాన్‌ పాత్రను కొనియాడారు. ఽధర్మేంద్రకు కీలక బాధ్యత ఇస్తామంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ప్రకటించారు. మోదీ, అమిత్‌ షాకు ప్రధాన్‌ చాలా సన్నిహితులు. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంలో మాజీ ఐఏఎస్‌ పాండ్యన్‌ పెత్తనం, పూరీ జగన్నాథ్‌ ఆలయం రత్న భాండాగారం తాళాలు మాయమయ్యాయనే కీలక అంశాలను లేవనెత్తి.. బీజేడీ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించారు. కాగా, ఒడిశా సీఎం రేసులో సీనియర్‌ నేతలు సంబిత్‌ పాత్ర, జ్యుయల్‌ ఓరమ్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 07 , 2024 | 02:40 AM