Share News

GST: రూ.2వేలలోపు పేమెంట్స్‌కూ జీఎస్టీ?

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:50 AM

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.2వేలలోపు లావాదేవీలపై జీఎస్టీ విధించమని చెప్పిన మోదీ సర్కారు ఇప్పుడు ఆ భారం మోపేలా ఉంది.

GST: రూ.2వేలలోపు పేమెంట్స్‌కూ జీఎస్టీ?

  • అగ్రిగేటర్ల ద్వారా జరిపే చెల్లింపులకు వర్తింపు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.2వేలలోపు లావాదేవీలపై జీఎస్టీ విధించమని చెప్పిన మోదీ సర్కారు ఇప్పుడు ఆ భారం మోపేలా ఉంది. రేజర్‌పే, పైన్‌లాబ్స్‌ వంటి పేమెంట్‌ అగ్రిగేటర్ల ద్వారా.. ప్రజలు జరిపే చెల్లింపులకు కూడా వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీటి ద్వారా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో జరిపే లావాదేవీల్లో రూ.2వేలకు పైబడిన వాటిపైనే జీఎస్టీ వసూలు చేస్తున్నారు. రూ.2వేలలోపు చెల్లింపులపైనా 18 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనను జీఎస్టీ మండలి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.


సోమవారం (9వ తేదీన) ఢిల్లీలో జరగనున్న జీఎస్టీ సమావేశంలో దీనిపై చర్చించున్నారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 2017 నుంచి రూ.2వేలలోపు చెల్లింపులపై పేమెంట్‌ అగ్రిగేటర్ల (పీఏ)కు జీఎస్టీ మినహాయింపు ఇస్తున్నారు. దీనివల్ల ప్రజలపై భారం పడటం లేదు. అయితే ఈ పేమెంట్‌ అగ్రిగేటర్లు బ్యాంకింగ్‌ కంపెనీలు, ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు లేదా ఎన్‌బీఎ్‌ఫసీల కిందకు రారని, ఈ అగ్రిగేటర్లు ఇంటర్‌మీడియటరీలుగా వ్యవహరిస్తున్నట్టు చట్టం చెబుతోంది.


కాబట్టి వీరి సర్వీసులన్నిటికీ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని చట్టం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో రూ.2వేలలోపు అగ్రిగేటర్ల ద్వారా జరిపే చెల్లింపులపై జీఎస్టీ విధించాలని మండలి నామినేట్‌ చేసిన ఫిట్‌మెంట్‌ కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. జీఎస్టీ మండలి సందర్భంగా ఈ ప్రతిపాదనపై ఓ నిర్ణయం తీసుకోనుంది. రూ.2వేలలోపు చెల్లింపులపై జీఎస్టీ విధిస్తే ఆ భారం పీఏ లైసెన్స్‌లు ఉన్న పైన్‌లాబ్స్‌, రేజర్‌పే, పేయూ, ఇన్ఫీబీమ్‌ తదితర కంపెనీలపై పడుతుంది. ఒక్కో లావాదేవీపై ఈ పేమెంట్‌ అగ్రిగేటర్లు 0.5 శాతం నుంచి 2 శాతం పేమెంట్‌ గేట్‌వే ఫీజును వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదనంగా పన్ను విధిస్తే అది కస్టమరుపైనే పడుతుంది.

Updated Date - Sep 07 , 2024 | 05:50 AM