Hurun India Rich : భాగ్యనగరమే
ABN , Publish Date - Aug 30 , 2024 | 02:48 AM
మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరం అని తాజాగా మరోమారు వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో దక్షిణాదిలో నెంబర్‌వన్‌గా నిలవటమేగాక దేశంలో ఢిల్లీ, ముంబై తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
దేశంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న 3వ నగరం.. ముంబై, ఢిల్లీ తర్వాత మనమే
నగరంలో 104మంది సహస్ర కోటీశ్వరులు
అగ్రభాగాన రూ.76,100 కోట్లతో మురళీ దివి కుటుంబం
దేశంలో అదానీ మళ్లీ నెంబర్‌వన్
రూ.11.60 లక్షల కోట్ల నికర సంపద
హురున్ ఇండియా రిచ్‌లిస్ట్-2024 వెల్లడి
ముంబై, ఆగస్టు 29: మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరం అని తాజాగా మరోమారు వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో దక్షిణాదిలో నెంబర్‌వన్‌గా నిలవటమేగాక దేశంలో ఢిల్లీ, ముంబై తర్వాత మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో 18 మంది బిలియనీర్లు (వందకోట్ల డాలర్లు అంటే రూ.8,388 కోట్ల నికర సంపద ఉన్నవారు), 104 మంది సంపన్నులు (రూ.వెయ్యి కోట్ల నికర సంపద ఉన్నవారు) ఉన్నారని గురువారం విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2024 వెల్లడించింది.
ఇప్పటి వరకూ మూడోస్థానంలో ఉన్న బెంగళూరును వెనక్కినెట్టి హైదరాబాద్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. రూ.76,100 కోట్ల నికర సంపదతో మురళీ దివి కుటుంబం హైదరాబాద్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉంది. నగరానికి చెందిన పి.పిచ్చిరెడ్డి (రూ.54,800 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి (రూ.52,700 కోట్లు), బి.పార్థసారథిరెడ్డి (రూ.29,900 కోట్లు) రిచ్ లి్‌స్ట జాబితాలో ఉన్నారు. కాగా, దేశవ్యాప్తంగా బిలియనీర్ల పరంగా చూస్తే గౌతమ్ అదానీ తిరిగి నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో అదానీ సంపద 57 శాతం ఆవిరైపోయి రూ.4.74 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో రూ.8.08 లక్షల కోట్లతో ముఖేశ్ అంబానీ హురున్ రిచ్ లిస్ట్-2023లో అగ్రస్థానంలో నిలిచారు. అయితే, అదానీ తిరిగి పుంజుకున్నారు. రూ.11.60 లక్షల కోట్ల నికర సంపదతో ఈ ఏడాది భారత్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
గత ఏడాదితో పోల్చితే ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరిగింది. అదానీ తర్వాత రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేశ్ అంబానీ రూ.10.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద గత ఏడాదితో పోల్చితే 25 శాతం పెరిగింది. అదానీ, అంబానీల తర్వాత మూడోస్థానంలో.. రూ.3.14 లక్షల కోట్ల నికర సంపదతో హెచ్‌సీఎల్ కంపెనీ యజమాని శివ్‌నాడర్ నిలిచారు. రూ.2.89 లక్షల కోట్లతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని సైరస్ పూనావాలా 4వ స్థానాన్ని, రూ.2.5 లక్షల కోట్లతో సన్ ఫార్మసూటికల్స్ దిలీప్ షాంఘ్వి 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల పరంగా చూస్తే రూ.47,500 కోట్ల నికర సంపదతో జోహో కంపెనీ యజమానురాలు రాధా వెంబూ తొలిస్థానంలో ఉన్నారు.
20 ఏళ్ల కైవల్య వోహ్రా (రూ.3,600 కోట్లు), 22 ఏళ్ల ఆదిత్ పాలిచా (రూ.4,300 కోట్లు).. సంపన్నుల జాబితాలో అత్యంత పిన్న వయస్కులుగా నిలిచారు. వీరిద్దరూ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో వ్యవస్థాపకులు. రూ.7,300 కోట్ల సంపదతో షారూక్‌ఖాన్ తొలిసారిగా హురున్ రిచ్ లిస్ట్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుల జాబితాలో తొలిస్థానంలో షారూక్ ఉండగా.. రెండో స్థానంలో రూ.4,600 కోట్లతో ఆయన వ్యాపార భాగస్వామి జూహీచావ్లా ఉన్నారు. తర్వాత స్థానాల్లో హృతిక్ రోషన్, అమితాబ్ బచన్, కరణ్ జోహర్ నిలిచారు. ఈసారి 16 మంది కార్పొరేట్ ఉన్నతోద్యోగులు కూడా హురున్ లిస్ట్‌లో చేరారు. వీరిలో అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ (రూ.32,100 కోట్లు), డీ మార్ట్ సీఈఓ ఇగ్నేషియస్ నావిల్ నోరోన్హా (రూ.6,900 కోట్లు) తదితరులున్నారు. భారత్‌లో ప్రతి ఐదు రోజులకు కొత్తగా ఒక బిలియనీర్ ఆవిర్భవిస్తున్నట్లుగా హురున్ రిచ్ లిస్ట్ వెల్లడించింది.
బీజింగ్‌ను తలదన్నిన ముంబై
సంపన్నుల పరంగా చైనా రాజధాని బీజింగ్‌ను ముంబై దాటిపోయిందని ఈ ఏడాది మార్చిలోనే హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ వెల్లడించింది. బిలియనీర్ల సగటు సంపద చైనాలో రూ.26,840 కోట్లు కాగా.. భారత్‌లో అది రూ.31,873 కోట్లు అని ఈ జాబితా తెలిపింది. బీజింగ్‌లో 91 మంది బిలియనీర్లు ఉండగా ముంబైలో 92 మంది ఉన్నారని.. తద్వారా దక్షిణాసియా బిలియనీర్ల రాజధానిగా ముంబై రికార్డు నెలకొల్పిందని పేర్కొంది.
సంపన్నుల సంపదలో 46 శాతం వృద్ధి
హురున్ భారత సంపన్నుల జాబితాలో ఈసారి మొత్తం 1539 మంది స్థానం సంపాదించుకున్నారు (వీరిలో 334 మంది బిలియనీర్లు). గత ఏడాది జాబితాతో పోల్చితే ఈసారి 220 మంది అదనంగా చేరారు. అలాగే, గత ఏడాదితో చూస్తే సంపన్నుల మొత్తం సంపద ఈసారి 46 శాతం పెరిగింది. దేశంలోని నగరాల పరంగా చూస్తే 386 మంది సంపన్నులతో (వీరిలో 92 మంది బిలియనీర్లు) ముంబై తొలిస్థానంలో ఉంది. 217 మంది సంపన్నులతో (వీరిలో 68 మంది బిలియనీర్లు) రెండో స్థానంలో ఢిల్లీ నిలిచింది. కాగా, గత ఏడాది హురున్ లిస్టులో 3వ స్థానంలో ఉన్న బెంగళూరును అధిగమించి తొలిసారిగా ఆ స్థానాన్ని హైదరాబాద్ కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో ఉన్న సంపన్నుల సంఖ్య 104 (వీరిలో 18 మంది బిలియనీర్లు). గత ఏడాదితో పోల్చితే 17 మంది ఎక్కువ. తదుపరి స్థానాల్లో బెంగళూరు (100), చెన్నై (82), కోల్‌కతా (69), అహ్మదాబాద్ (67), పుణె (53), సూరత్ (28), గురుగ్రామ్ (23) ఉన్నాయి. రిచ్ లిస్ట్‌పై హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ప్రధాన పరిశోధకుడు ఆనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ, ఆసియాలోనే సంపదను సృష్టించే ఇంజిన్‌గా భారత్ ఆవిర్భవిస్తోందన్నారు. భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 29 శాతం పెరగగా, చైనాలో 25 శాతం తగ్గుదల నమోదైందన్నారు.