Manipur: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:48 PM
Manipur: కొత్త ఏడాది మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆకాంక్షించారు. గతేడాది మే మాసం నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తనను క్షమించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు కోరారు.
ఇంపాల్, డిసెంబర్ 31: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా జాతుల మధ్య ఘర్షణలతో నలిగిపోతుంది. ఈ నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ మంగళవారం ఇంఫాల్‌లో స్పందించారు. రాష్ట్రంలో అనుకోకుండా చోటు చేసుకున్న ఈ ఘటనలపై మణిపూర్ ప్రజలకు సీఎం బిరెన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. మరికొన్ని ఘడియాల్లో కొత్త సంవత్సరం.. 2025 ప్రారంభమవుతోందన్నారు. ఈ కొత్త ఏడాదిలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకోంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గతేడాది మార్చి 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తనను క్షమించాలని ప్రజలను సీఎం ఎన్ బీరెన్ సింగ్ కోరారు. అయితే గత మూడు నాలుగు నెలల నుంచి మాత్రం కొంత శాంతి స్థాపన రాష్ట్రంలో నెలకొందన్నారు. ఇక 2025లో రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
గతంలో జరిగిందేదో జరిగిపోయిందన్నారు. గతంలో జరిగిన తప్పులు వదిలి వేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. కొత్త సంవత్సరంలో మణిపూర్‌లో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరిసేందుకు అందరు ఒక తాటిపైకి కలిసి రావాలని అన్ని వర్గాల ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 35 తెగల ప్రజలు సామరస్యంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు.
2023, మే 3వ తేదీన మణిపూర్ రాష్ట్రంలో మైయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైనాయన్నారు. ఈ హింస కారణంగా 225 మందికిపైగా ప్రజలు మరణించారని.. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారని సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇక తమను సైతం షెడ్యూల్ తెగల వారి జాబితాలో చేర్చాలంటూ మైయితీ వర్గం చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. దీనిని కుకీ తెగ వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. ఇక మణిపూర్‌లో మైయితీ వర్గం ప్రజలు 53 శాతం మేర ఉన్నారు. వారంతా ఇంఫాల్ వ్యాలీలో జీవిస్తున్నారు. అలాగే షెడ్యూల్ తెగలు నాగాలు, కుకీ వర్గం వారు 40 శాతం మంది కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
మరోవైపు ఇటీవల రాష్ట్రంలో ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. వారి మృతదేహాలను సమీపంలోని నది వద్ద స్థానికులు గుర్తించారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో హింస మళ్లీ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభ వేళ... రాష్ట్రంలో మళ్లీ శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయని.. తద్వారా మణిపూర్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారని సీఎం బిరెన్ సింగ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
For National news And Telugu News