Chhattisgarh : చేతబడి నెపంతో 9 మంది హత్య
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:08 AM
చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన 9 మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా చంపేశారు.
ఛత్తీస్గఢ్లో 4 రోజుల వ్యవధిలో రెండు దారుణాలు.. మృతుల్లో 11 నెలల పసికందు
రాయ్పూర్, సెప్టెంబరు 15: చేతబడి చేస్తున్నారనే అనుమానంతో రెండు కుటుంబాలకు చెందిన 9 మందిని ఇరుగుపొరుగు వారే అతి కిరాతకంగా చంపేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 4 రోజుల వ్యవధిలో ఈ రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి.. ఆదివారం సుక్మా జిల్లా ఇట్కల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై గొడళ్లు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. మృతులను మౌసం కన్నా (60), బుచ్చా (34), అర్జో (32), బీరి, కర్క లచ్చి (43)గా పోలీసులు గుర్తించారు. మౌసం కన్నా కుటుంబం నిర్వహిస్తున్న క్షుద్రపూజల కారణంగా పలువురు చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఈ దాడికి ఒడిగట్టినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ జి చవాన్ తెలిపారు. అంతకుముందు.. గురువారం(ఈ నెల 12న) ఛార్ఛెడ్ గ్రామంలోనూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని పొరుగింటి వారే చంపేశారు. మృతుల్లో 11 నెలల మగ శిశువు కూడా ఉన్నాడు. మృతులను చైత్రం కైవర్త్య(47), యశోద (30), జమున(28), యశ్ (11 నెలలు)గా గుర్తించారు. చైత్రం కైవర్త్య తల్లి చేస్తున్న క్షుద్రపూజల కారణంగా తమ కూతురి ఆరోగ్యం దెబ్బతిందని ఆరోపిస్తూ పొరుగింట్లో ఉండే రాంనాథ్ పాట్లే కుటుంబం ఈ దాడి చేసిందని పోలీసులు చెప్పారు.