Narendra Modi: ఏడాదికో ప్రధాని.. 'ఇండియా' కూటమి కొత్త ఫార్ములా : మోదీ
ABN , Publish Date - Apr 24 , 2024 | 08:43 PM
'ఇండియా' కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ఏడాదికి ఒకరిని ప్రధాన మంత్రి చేసే ఆలోచనలో ప్రస్తుతం విపక్ష కూటమి ఉన్నట్టు తెలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లోని బేతుల్‌లో బుధవారంనాడు ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.
బేతుల్: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ఏడాదికి ఒకరిని ప్రధాన మంత్రి చేసే ఆలోచనలో ప్రస్తుతం విపక్ష కూటమి ఉన్నట్టు తెలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని బేతుల్‌లో బుధవారంనాడు ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ప్రధాని కుర్చీలో ఏడాదికో ప్రధానిని నిలపాలనే ఆలోచనలో ఇండియా కూటమి ఉన్నట్టు కథనాలు వస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో చేయాల్సిన పనులపై తాను కసరత్తు చేస్తుంటే, విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిని కూడా ప్రకటించ లేకపోయిందన్నారు.
''వారి ('ఇండియా' కూటమి) ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది దేశానికి తెలియాలి. మావైపు నుంచి పదేళ్ల ట్రాక్ రికార్డుతో మోదీ మీ ముందే ఉన్నారు. విపక్షాలు పీఎం ఫేస్ కోసం వెతికి ఒక్కరినీ ఎంచుకోలేకపోయాయి. ఏడాదికో ఒకరిని ప్రధానిని చేసే ఆలోచన జరుగుతోందని మీడియాలో ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. అంటే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అవుతారు. అప్పుడు దేశానికి ఏం జరుగుతుంది?'' అని మోదీ ప్రశ్నించారు.
వేలానికి పీఎం కుర్చీ..
'ఇండియా' కూటమి పీఎం ఫార్ములాపై మోదీ మరింత లోతుగా మాట్లాడుతూ, ఏడాదికో ప్రధాని ఫార్ములా అంటే ప్రధాని కుర్చీని వేలానికి పెట్టడమే అవుతుందన్నారు. ''ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుంటారు. ఆయన ఏడాది పదవీకాలం పూర్తయ్యేంత వరకూ తగ్గిన నలుగురు వేచిచూస్తుంటారు. ఇది చాలా భయానక ప్రతిపాదన. దేశాన్ని ధ్వంసం చేస్తుంది. ఇందవల్ల మీ స్వప్నాలు చెల్లాచెదురవుతాయి'' అని ర్యాలీకి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి మోదీ అన్నారు. ఈనెల 26వ తేదీన లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగనుంది. బుధవారం సాయంత్రంతో ఈ విడత పోలింగ్ ప్రచారానికి తెరపడింది.
Read National News and Telugu News