Italy: వాష్ రూమ్‌లో శవమై కనిపించిన భారత విద్యార్థి
ABN , Publish Date - Jan 07 , 2024 | 10:33 AM
ఇటలీలో భారత విద్యార్థి మృతి చెందాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ జనవరి 2న మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీకి వెళ్లాడు.
ఇటలీలో భారత విద్యార్థి మృతి చెందాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ జనవరి 2న మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీకి వెళ్లాడు. అక్కడే అద్దె గదిలో ఉంటున్నాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసేందుకు రౌత్ తల్లిదండ్రులు ఈ నెల 1న అతనికి ఫోన్ చేశారు. కానీ రౌత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో రౌత్ తల్లిదండ్రులు అతని ఇంటి యజమానికి ఫోన్ చేశారు. రౌత్ మరొకరి ఇంట్లోని వాష్‌రూమ్‌లో శవమై కనిపించాడని సదరు యజమాని వారికి తెలియచేశాడు. దీంతో రౌత్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే రౌత్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రౌత్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి అతని కుటుంబసభ్యులు జార్ఖండ్ సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను సంప్రదించారు. దీంతో స్పందించిన ప్రభుత్వ అధికారులు రామ్ రౌత్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటనపై వెస్ట్ సింగ్‌భూమ్ డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్ మాట్లాడుతూ.. రామ్ రౌత్ మరణం గురించి తనకు సమాచారం అందిందని తెలిపారు. అవసరమైన చర్యల కోసం హోం శాఖ, జార్ఖండ్ మైగ్రేషన్ విభాగానికి సమాచారం అందిచినట్లు చెప్పారు. ఈ కేసులో తాను అన్ని పరిణామాలను పర్యవేక్షిస్తున్నానని, రౌత్ కుటుంబంతో కూడా టచ్‌లో ఉన్నానని మిట్టల్ తెలిపారు.