Railway Board : రైలు ముందు రీల్స్ వద్దు
ABN , Publish Date - Nov 16 , 2024 | 03:14 AM
రీల్స్ పేరుతో రైల్వే కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం, ప్రయాణికులకు అసౌకర్యం కల్పించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రైల్వేబోర్డ్ నిర్ణయించింది.
ఆటంకం కలిగిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు
అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు
రైల్వే ప్రాంగణాల్లో రీల్స్ చేస్తే జైలే
న్యూఢిల్లీ, నవంబరు15: రీల్స్ పేరుతో రైల్వే కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం, ప్రయాణికులకు అసౌకర్యం కల్పించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రైల్వేబోర్డ్ నిర్ణయించింది. రైల్వే ప్రాంగణాలు, రైల్వే ట్రాకులు, కదులుతున్న రైళ్లలో ఈ తరహా ఘటనలు పెరిగిపోవడంతో ఇలాంటి వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు రైల్వేబోర్డు అన్ని జోన్లకు ఆదేశాలు పంపింది. సోషల్ మీడియాలో పోస్టుల కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమే కాకుండా మిగతా ప్రయాణికులకు ప్రమాదకరంగా తయారు కావడంతో కఠినచర్యలు తీసుకోకతప్పడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇటీవల చెన్నైలోని వ్యాసర్‌పాడి జీవా రైల్వేస్టేషన్‌లో కొందరు విద్యార్థులు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తూ గందరగోళం సృష్టించడంతో పాటు రైలుపైకి ఎక్కి హంగామా చేశారు. ఈ ఘటనలో పది మంది విద్యార్థులపై రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.