Caste Census: కూటమిలో కుంపటి.. కుల గణనపై 'ఇండియా'వైపు జేడీయూ మొగ్గు
ABN , Publish Date - Aug 30 , 2024 | 12:58 PM
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుల గణన(Caste Census) జరపాలని డిమాండ్లు వెలువెత్తుతున్న వేళ.. అధికార ఎన్డీయేలో ఈ అంశం కుంపట్లు రాజేస్తోంది.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుల గణన(Caste Census) జరపాలని డిమాండ్లు వెలువెత్తుతున్న వేళ.. అధికార ఎన్డీయేలో ఈ అంశం కుంపట్లు రాజేస్తోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కి చెందిన జేడీయూ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కుల గణన అంశాన్ని బీజేపీ పెద్దగా ప్రస్తావించకపోవడంపై జేడీయూ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. బిహార్ మాదిరిగానే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సహా, ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ సైతం ఇదే డిమాండ్‌ని తెరపైకి తెచ్చింది. ఓబీసీల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటు కమిటీలో జేడీయూ గురువారం చేరింది.
వివరాలు..
డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, బీజేపీ సభ్యుడు గణేష్ సింగ్ అధ్యక్షతన జరిగిన కమిటీ తొలి సమావేశంలో ఎజెండాలో మొదటి అంశంగా "కుల గణన"ను చేర్చాలని కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాగూర్ ప్రతిపాదించారు. దీనిని తృణమూల్ కాంగ్రెస్ (TMC) సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ బలపర్చారు. ఈ ప్రతిపాదనకు జేడీయూ సభ్యుడు గిర్ధారి యాదవ్ మద్దతు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. కులగణన అంశంపై కమిటీ చర్చించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. కుల గణనను నిర్వహించాలని కోరుతూ కమిటీ అధికారికంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని టీఎంసీ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ సిఫార్సు చేశారు.
అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగమైన JD(U) దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేస్తోంది. బిహార్‌లో గతేడాది కుల గణన నివేదికను నితీశ్ సర్కార్ విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 13 కోట్లు. ఇందులో ఇతర వెనుకబడిన కులాల వారు(ఓబీసీలు) 27.12 శాతం, అత్యంత వెనుకబడిన వర్గాల వారు(ఈబీసీలు) 36.01 శాతం, షెడ్యూల్డ్ కులాల(SC) వారు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలవారు(ST) 1.68 శాతం ఉన్నారు. అగ్రవర్ణాల జనాభా సంఖ్య 15.52 శాతంగా ఉంది. ఓబీసీలు 27.12 శాతం, ఈబీసీలు 36.01 శాతం కలుపుకొని బీసీలు 63.13 శాతం మంది ఉన్నారు.
For Latest News click here