Kamala Haasan: డీఎంకే కూటమిలో కమలహాసన్‌కు రాజ్యసభ సీటే..
ABN , Publish Date - Mar 10 , 2024 | 10:39 AM
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ సినీ నటుడు కమలహాసన్(Kamala Haasan) నాయకత్వంలోని మక్కల్ నీదిమయ్యం పార్టీ డీఎంకే కూటమిలో స్థానం మాత్రమే సంపాదించుకుంది.
- లోక్‌సభ ఎన్నికలకు దూరం
- ప్రచారానికే ఉలగ నాయకుడు పరిమితం
చెన్నై: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ సినీ నటుడు కమలహాసన్(Kamala Haasan) నాయకత్వంలోని మక్కల్ నీదిమయ్యం పార్టీ డీఎంకే కూటమిలో స్థానం మాత్రమే సంపాదించుకుంది. ఒక్క సీటును కూడా సంపాదించుకోలేకపోయింది. ఆ మేరకు శనివారం మధ్యాహ్నం డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో కమల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీటివ్వని డీఎంకే వచ్చే యేడాది జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కమల్ పార్టీకి సీటును కేటాయించేందుకు అంగీకరించింది. ఈ ప్రతిపాదన ప్రకారమే రెండు పార్టీల నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఎన్నికల ఒప్పందం కుదుర్చుకునేందుకు శనివారం మధ్యాహ్నం అరివాలయానికి వెళ్లిన కమల్‌కు మంత్రి ఉదయనిధి స్వాగతం పలికారు. అటుపిమ్మట పావుగంట సేపు స్టాలిన్‌తో ఆయన చర్చించారు. చివరగా వచ్చే యేడాది జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో సీటును కేటాయించేందుకు స్టాలిన్ అంగీకరించారు. ఆ తర్వాత డీఎంకే సీనియర్ నేతల నడుమ ఇరువురూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ప్రచారం మాత్రమే...
డీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత కమల్ అరివాలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన పార్టీ తరఫున కూడా ఎవరూ నిలబడరని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య ఏర్పడిన ఒప్పందం పదవుల కోసం కుదుర్చుకున్న ఒప్పందంగా భావించకూడదని, దేశ సంక్షేమం దృష్ట్యా ఏర్పరచుకున్నదిగా పరిగణించాలన్నారు. దేశ ప్రగతి కోసం ఎవరితో కరచాలనం చేయాలో ఆయనతోనే చేశానని కమల్ చెప్పారు.