Share News

Suprme Court: కావడి యాత్రలో పేర్ల ప్రదర్శనపై స్టే.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని 'సుప్రీం' ఆగ్రహం

ABN , Publish Date - Jul 22 , 2024 | 02:40 PM

కన్వర్ యాత్ర(కావడి యాత్ర) మార్గంలోని తినుబండారాల యజమానులు బయట తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది.

Suprme Court: కావడి యాత్రలో పేర్ల ప్రదర్శనపై స్టే.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని 'సుప్రీం' ఆగ్రహం

ఢిల్లీ: కన్వర్ యాత్ర(కావడి యాత్ర) మార్గంలోని తినుబండారాల యజమానులు బయట తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది.

షాపు యజమానులు తమ షాపుల ముందు తమ పేరు లేదా గుర్తింపును చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తయారు చేస్తున్న ఆహారాన్ని మాత్రమే ప్రదర్శించాలని దుకాణదారులను ఆదేశించింది. ప్రభుత్వాల ఆదేశాలు రాజ్యాంగ స్ఫూ్ర్తికి విరుద్ధమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.


న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానమివ్వాలని కోరింది. ఆహార విక్రయదారులు యజమానులు, ఉద్యోగుల పేర్లు రాయాలని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

తదుపరి విచారణను జులై 26కి వాయిదా వేసింది. "ప్రభుత్వాల ఆదేశాలను అమలు చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సముచితమని మేం భావిస్తున్నాం. దుకాణదారులు ఆహార పదార్థాలను షాప్ బయట ప్రదర్శించాలి. కానీ యజమానులు, సిబ్బంది పేర్లను ప్రదర్శించమని బలవంతం చేయకూడదు. ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ సర్కార్‌లు సమాధానం చెప్పాలి " అని బెంచ్ పేర్కొంది.


కావడి యాత్ర అంటే..

ఏటా శ్రావణమాసంలో చేపట్టే కావడి యాత్రలో భాగంగా శివభక్తులు నెల రోజులపాటు గంగానది జలాలను కావిళ్లతో సేకరించి స్వస్థలాలకు తరలిస్తారు. ఈ ఏడాది యాత్ర ఇవాళ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఈ యాత్ర కోసం పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశాయి.

అయితే దుకాణాల యజమానులు తమ పేర్లు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మైనారిటీలపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నాయి.


ఇప్పుడే వివాదమెందుకు..

పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. కన్వర్ యాత్రలు దశాబ్దాలుగా జరుగుతున్నాయని, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు సహా అన్ని మతాల ప్రజలు కన్వర్ యాత్రలో వెళ్తున్న వారికి సాయం చేస్తున్నారని సింఘ్వీ చెప్పారు.

హిందువులు నడిపే వెజ్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయని, వాటిలో ముస్లిం ఉద్యోగులు ఉండవచ్చునని, ఆ ఆహారం ముస్లింలు లేదా దళితులు ముట్టుకున్నందున అక్కడికి వెళ్లి తినబోమని చెప్పగలరా? అని సింఘ్వీ ప్రశ్నించారు. ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలపై ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు.

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 02:41 PM