Arvind Kejriwal: పాక్ మంత్రికి క్లాస్ పీకిన కేజ్రీవాల్
ABN , Publish Date - May 25 , 2024 | 02:58 PM
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా దేశరాజధానిలో పోలింగ్ జరుగుతుండగా పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే, అంతే వేగంగా కేజ్రీవాల్ స్పందించారు. ''ముందు మీ సొంతిల్లు చక్కబెట్టుకోండి'' అంటూ పాక్ మంత్రికి క్లాస్ పీకారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా దేశరాజధానిలో పోలింగ్ జరుగుతుండగా పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి (Fawad Chaudhry) మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మద్దతుగా ట్వీట్ చేశారు. ''విద్వేష, తీవ్రవాద శక్తులపై శాంతి, సామరస్యాలదే గెలుపు కావాలి'' అంటూ ఆయన పోస్ట్ చేశారు. అయితే, అంతే వేగంగా కేజ్రీవాల్ స్పందించారు. ''ముందు మీ సొంతిల్లు చక్కబెట్టుకోండి'' అంటూ పాక్ మంత్రికి క్లాస్ పీకారు.
Delhi: నియంతృత్వం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా ఓటు వేశా: అరవింద్ కేజ్రీవాల్
ఇలా జరిగింది..
అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఉదయం ఢిల్లీలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ''నా తండ్రి, భార్య, పిల్లలతో కలిసి నేను ఓటు వేశాను. అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె ఓటు వేయలేదు. నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా నేను ఓటు వేశాను. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోండి'' అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే కేజ్రీవాల్ ఫోటోను రీపోస్ట్ చేస్తూ పాక్ మంత్రి చౌదరి ఫవద్ హుస్సేన్ ట్వీట్ చేశారు. విద్వేష, తీవ్రవాద శక్తులను శాంతి, సామరస్యం ఓడించాలని ఆశిస్తున్నట్టు ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై కేజ్రీవాల్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కౌంటర్ అటాక్ ఇచ్చారు. ''చౌదరి సాహిబ్.. నేను, నా దేశ ప్రజలు మా సొంత సమస్యలను పరిష్కరించుకోగలం. మీ ట్వీట్ అవసరం లేదు. పాకిస్తాన్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మీరు మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'' అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇండియాలో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారమని, అతిపెద్ద ఉగ్రవాద స్పాన్సరర్ల జోక్యం తమకు అవవసరం లేదని కేజ్రీవాల్ తన పోస్ట్‌లో ఘాటుగా జవాబిచ్చారు. కేజ్రీవాల్ ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం బెయిలుపై బయటకు వచ్చినప్పుడు కూడా ఆయనకు మద్దతుగా చౌదరి ట్వీట్ చేశారు.